ఒక్కో కరోనా బాధితుడికి అయ్యే ఖర్చు ఎంతంటే…
★ ఒక్కో కరోనా బాధితుడు ఆస్పత్రిలో చేరిన మొదలుకుని కోలుకుని ఇంటికి చేరే వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆ విషయాన్ని తెలుసుకుందాం.
★ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి.
★ రోగులను ఆరోగ్యంగా తిరిగి ఇళ్లకు పంపడానికి ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
★ వైరస్ నిర్ధారణ పరీక్ష మొదలు కోలుకొని డిశ్చార్జి అయ్యేవరకు ఒక్కో వ్యక్తికి రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఏ పరీక్షకు ఎంతెంత ఖర్చు అవుతుందో కూడా వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
★ ఒక కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4,500 అవుతుందని తేల్చారు. పాజిటివ్ కేసులకు చికిత్స అనంతరం మరో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. ఇలా ఒక్కొక్కరికీ రూ.13,500 చొప్పున కేవలం నిర్ధారణ పరీక్షలకే అవుతుందని వెల్లడించారు.
★ అనుమానితులను అంబులెన్స్‌లోనే ఆస్పత్రికి తీసుకొచ్చి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అనంతరం డిశ్చార్జి చేసిన వ్యక్తిని ప్రభుత్వమే వాహనం ఏర్పాటు చేసి ఇంటికి పంపుతుంది. అంటే ఒక్కో రోగి రవాణా ఖర్చు రూ.4 వేలకు పైమాటే.
★ పాజిటివ్ వ్యక్తులకు కోలుకొనే వరకు కనీసం 80 వరకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ఉపయోగిస్తారు. ఈ కిట్లను ఒక్కసారి వాడితే తిరిగి వినియోగించే అవకాశం లేదు.
★ ఒక్కో కిట్ ధర రూ.2,500 వరకు ఉంటుంది. ఒక్కో వ్యక్తికి పీపీఈ కిట్ల కోసం రూ.2 లక్షలు ఖర్చు వస్తుంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న వారి విషయంలో ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్లకు ఎక్కువ మొత్తంలో పీపీఈ కిట్లు మార్చాల్సి ఉంటుంది.
★ అలాగే కొవిడ్ సోకినవారిలో రోగనిరోధకశక్తి పెంచేందుకు, వారికి యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ మందులు, ఫ్లూయిడ్స్, ఇతర మందులు అందించేందుకు రూ.50 వేలు అవుతున్నదని అంచనా.
★ ఉదాహరణకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి విషయానికి వస్తే… ప్రత్యేక మెనూతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. బాధితుల్లో రోగనిరోధకశక్తిని పెంచేలా ప్రతిరోజు ఉదయం అల్పాహారం, రెండుసార్లు భోజనం, డ్రైఫ్రూట్స్, పాలు, బ్రెడ్, నాలుగు వాటర్ బాటిళ్లు అందజేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చు రూ.55 వేలు. ఇంతటితో అయిపోలేదు.
★ రోగులకు అవసరమైన సబ్బులు, శానిటైజర్, ప్రత్యేక డ్రెస్ వంటివి ఇస్తారు. వీటి కోసం రూ.27 వేలు ఖర్చొస్తోంది.
★ సాధారణంగా 14 రోజుల్లో కరోనా రోగి కోలుకొని డిశ్చార్జి అవుతారు. ఒకవేళ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం 21 రోజుల వరకు చికిత్స పొందుతున్నారు.
★ కరోనా వైరస్ నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి కావాలంటే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది.
*అందుకే కరోనా వైరస్ బారిన పడటం కంటే… ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండటం ఎంతో మంచిది.*??