కాళేశ్వ‌రం, దేవాదుల సాగునీటితో బీడువారిన తెలంగాణ భూములు స‌స్య‌శ్యామ‌లం అవుతున్నాయి…ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్


నీరు లేక‌, క‌న్నీరు కూడా ఇంకిపోయి మోడు వారిన తెలంగాణ రైతుల బ‌తుకులు బంగారు మ‌యం కానున్నాయి. సిఎం కెసిఆర్ చెప్పిన‌ట్లుగా పంట‌లు వేస్తే చాలు, తెలంగాణ రైతు ఇక రాజేన‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖామాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. దేవాదుల ప్ర‌ధాన కాలువ ప్యాకేజీ-46 ప్ర‌ధాన కాలువ‌కు ధర్మ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి ఈ నెల 14న నీటిని విడుద‌ల చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి, ఈ రోజు మంగ‌ళ‌వారం ఆ ప్ర‌ధాన కాలువ నీటిని వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా బొల్లికుంట‌, చెన్నారం, ఆశాల‌ప‌ల్లి, గ‌విచ‌ర్ల‌, రామ‌చంద్రాపురం గ్రామాల పంట పొలాల‌కు విడుద‌ల చేశారు. బొల్లికుంట వ‌ద్ద ప్ర‌జాప్ర‌తినిధులు, రైతుల‌తో క‌లిసి నీటికి నిరాజ‌నాలు ప‌లికి, పూజ‌లు చేసి, కెసిఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసి మంత్రి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. చెన్నారం, ఆశాల‌ప‌ల్లి, గ‌విచ‌ర్ల‌, రామ‌చంద్రాపురం గ్రామాల గుండా దాదాపు 8 కి.మీ. మేర మంత్రి ఎర్రబెల్లి పాద‌యాత్ర చేశారు. రైతుల‌తో క‌లిసి న‌డిచారు. ఈ సంద‌ర్భంగా కాలువ‌ల్లో నీళ్ళ‌తో రైతుల క‌ళ్ళ‌ల్లో ఆనంద బాష్పాలు క‌నిపించాయి. అడుగ‌డుగునా నీటికి స్వాగ‌తం ప‌లికి నీరాజ‌నాలు ప‌లికిన రైతులు, కాలువ‌ల నీటికి పూలు, ప‌సుపు, కుంకుమ‌ల‌తో పూజ‌లు చేశారు. కొబ్బ‌రి కాయ‌లు కొట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయా గ్రామాల రైతుల జై తెలంగాణ నినాదాల‌తో దేవాదుల ప్యాకేజీ-46 ప్ర‌ధాన కాలువ ద‌ద్ద‌రిల్లింది.ఆయా గ్రామాల్లో రైతులు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాల్లో రాష్ట్ర పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు మాట్లాడుతూ, అస‌లీ ప్రాంతానికి ఇలా కాలువ‌ల నీళ్ళు వ‌స్తాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఉద్య‌మ కాలంలో సీఎం కెసిఆర్ ఇచ్చిన మాట మేర‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టే కాదు, దేవాదుల లాంటి ప్రాజెక్టులు పూర్త‌యి ఇలా మంచినీటిని అందిస్తున్నాయ‌న్నారు. కెసిఆర్ 14ఏళ్ళు సుదీర్ఘ శాంతియుత పోరాటంచేసి తెలంగాణ సాధించారు. 14ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటం చేసి, ఈ ప్రాంత రైతులు సాగునీరు తెచ్చుకున్నార‌ని అభినందించారు.
సిఎం కెసిఆర్ విజ‌న్ ఉన్న నేత‌. కెసిఆర్ చెప్పిన‌ట్లుగా రైతులు ఇప్ప‌టి దాకా నీరులేక ఇబ్బందులు ప‌డ్డ రైతులు ఇక ఇప్పుడు లాభ‌సాటి పంట‌ల‌పై దృష్టి సారించాల‌న్నారు. ప్ర‌భుత్వం ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు పంట‌లు వేసి ప‌సిడి పంట‌లు పండించాల‌ని రైతుల‌ను కోరారు. ఏయే పంట‌లు, ఏయే భూముల్లో పండుతాయి? ఏయే కాలాల్లో ఏయే పంట‌లు వేయాలి వంటి అనేక వివ‌రాల‌తో ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

*నాగ‌లి ప‌ట్టి దున్ని… రైతుగా మారిన ద‌యాక‌ర్ రావు*

*నాగేటి సాళ్ళ‌ల్లో వేరుశ‌న‌గ విత్త‌నాలు వేసిన ఎర్ర‌బెల్లి*

రామ‌చంద్రాపురం రైతుల‌తో క‌లిసి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నాగ‌లి ప‌ట్టి దుక్కి దున్నారు. చెర్న‌కోలా ప‌ట్టుకుని, నాగ‌లి చేత‌బ‌ట్టి దున్నిన ఎర్ర‌బెల్లి రైతు అవ‌తారం ఎత్తారు. కొద్దిసేపే అలా దున్నిన ద‌యాక‌ర్ రావు, ఆ త‌ర్వాత ఆ నాగేటి సాళ్ళ‌ల్లో వేరుశ‌న‌గ విత్త‌నాలు చ‌ల్లారు.

*రైతులకు మాస్కులు పంపిణీ చేసిన మంత్రి*

మ‌రోవైపు క‌రోనా నేప‌థ్యంలో రైతులు సామాజిక దూరం పాటించాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని, స్వీయ నియంత్ర‌ణ‌తో క‌రోనా వైర‌స్ ని గెల‌వాల‌ని చెప్పారు. అలాగే రైతుల‌కు త‌న వ‌ద్ద ఉన్న మాస్కుల‌ను పంపిణీ చేశారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రి వెంట వ‌రంగ‌ల్ ఎంపీ పసునూరి ద‌యాక‌ర్, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, రైతులు, అధికారులు, ఆయా గ్రామాల ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

About The Author