పెళ్లి చేసుకోమంటే కాటికి పంపాడు..సిక్కిం మహిళ జీవితం విషాదాంతం.


హైదరాబాద్ : ఈ ఏడాది మార్చి 17వ తేదిన చేవేళ్ల తంగిడిపల్లి బ్రిడ్జి వేదికగా గుర్తుతెలియని మహిళ దారుణ హత్య కు గురైంది.. మహిళ ఆనవాళ్లు తెలీయకుండా ఆమె మొఖాన్ని చిద్రం చేశారు..అలాగే ఒంటిపై వస్త్రాలు తీసి వేసి శవాన్ని నగ్నంగా బ్రిడ్జి కింద పడేశారు.. ఈ హత్య సంచలనం కలిగించింది.. పోలీసులకు ఈ కేసు ఛాలెంజ్ గా మారింది.. ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఓపికగా పరిశోెధన చేసి అసలు నేరస్తుడిని, అతడి సహకరించిన వ్యక్తిని గుర్తించారు..అలాగే హత్యకు గురైన మహిళ సిక్కిం రాష్ట వాసిగా తేల్చారు.. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సిక్కిం రాష్ర్టానికి చెందిన 40 ఏళ్ల వివాహిత మహిళ పాసీ శెర్పా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌.
ఆమెకు ముంబైకి చెందిన ఓ 26 ఏండ్ల యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. అలా ఫేస్‌బుక్‌ చాటింగ్‌ స్నేహంగా మారింది. ఈ స్నేహం ముసుగులో యువకుడు ఆమె అందాన్ని పొగిడాడు. దీంతో ఆమె తన బాధలు చెప్పుకున్నది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు.. మాయ మాటలతో ఆమెను ట్రాప్‌ చేశాడు. అతని వలలోకి రాగానే ఆమెను రెండు సార్లు ముంబైకి పిలిపించుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని మాయ చేశాడు. అతని మోజులో పడ్డ శెర్పా భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి యువకుడిని పెండ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యింది. అయితే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని యువకుడు.. నీకు నాకు మధ్య చాలా వయస్సు తేడా ఉంది. నేను మరో పెండ్లి చేసుకుంటాను.. అని చెప్పాడు. అయినా శెర్పా తననే పెండ్లి చే సుకోమని వెంట పడింది. దీంతో శెర్పాను వదిలించుకునేందుకు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుని అందుకు స్కెచ్‌ వేశాడు. దీని కోసం హైదరాబాద్‌లోని తన స్నేహితుడిని పావుగా వాడుకున్నాడు.
ముంబైలో పరిచయం అయిన హైదరాబాద్‌ గచ్చిబౌలి హాస్టల్‌లో నివాసం ఉంటున్న అక్తర్‌ బారీకి ఆ యువకుడు ఫోన్‌ చేసి తన గర్ల్‌ ఫ్రెండ్‌తో నగరానికి వస్తున్నానని కారు ఏర్పాటు చేయమని కోరాడు. మార్చి 16న ఆ యువకుడు ప్రియురాలితో కలిసి నగరంలోని విమానాశ్రయానికి రాగా అక్తర్‌ బారీ అద్దె కారును తీసుకొచ్చి వారిని రిసీవ్‌ చేసుకున్నాడు. అక్కడి నుంచి వికారాబాద్‌ వరకు వెళ్లిన వారు అక్తర్‌ బారీని దించేసి. తాము వికారాబాద్‌ రీసార్ట్‌లో గది తీసుకున్నాం.. నీవు హాస్టల్‌కు వెళ్లు.. రాత్రికి తిరిగి వస్తాం అని చెప్పాడు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత తన పథకంలో భాగంగా ఆ యువకుడు కారులోనే ప్రియురాలిని గొంతు నులిమి చంపి కిందపడేసి ఎవరూ గుర్తు పట్టకుం డా దుస్తులు తీసేసి.. రాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి వెళ్లిపోయాడు. అక్కడినుంచి మార్చి 17న తెల్లవారు జామున యువకుడు వచ్చి కారును అక్తర్‌ బారీకి అప్పజెప్పి తిరిగి విమానంలో శంషాబాద్‌ నుంచి ముంబైకి వెళ్లిపోయాడు. మార్చి 17న ఉదయం చేవెళ్ల తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేసు విచారణ ప్రారంభించారు.. దర్యాప్తులో భాగంగా పోలీసులు తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద రెండు, ఎన్‌కేపల్లి వద్ద రెండు సీసీ కెమెరాలను పరిశీలించారు. తంగిడిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ రోజు రాత్రి దావతుకు వెళ్లి వస్తుంటే ఓ కారు ఆగిందని పోలీసులకు చెప్పాడు. దీని ఆధారంగా పోలీసులు వ్యక్తి చూసిన సమయానికి అంతకంటే ముందు, దాని తర్వాత సమయాన్ని క్రోడీకరించుకుని కారు మూమెంట్‌ను విశ్లేషించారు. ఇలా 20 కిలో మీటర్ల చదరపు దూరాన్ని సంఘటన వెలుగు చూసిన పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. అప్పుడు ఓ కెమెరాలో అనుమానించిన కారుపై డ్రైవ్‌ ఈజీ అని రాసి ఉంది. దీని ఆధారంగా అనుమానితుడు డ్రైవ్‌ ఈజీ ద్వారా కారును సెల్ఫ్‌ డ్రైవ్‌ తీసుకుని ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. డ్రైవ్‌ ఈజీ సంస్థ దగ్గర కారును అద్దెకు తీసుకున్నప్పుడు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు, ఫోన్‌ నంబర్లను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. దాని ఆధారంగా ముంబై యువకుడికి సహకరించిన అక్తర్‌ బారీ బయటపడ్డాడు. అతన్ని అరెస్ట్‌చేసి విచారించడంతో ముంబై యువకుడి గురించి చెప్పాడు. సోషల్‌ మీడియా విమానాశ్రయం సీసీ కెమెరాలను జల్లెడ పడితే మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు కరోనా అడ్డురావడంతో అరెస్ట్‌ను తా త్కాలికంగా విరమించుకున్నారు. కరోనా తగ్గుముఖం పడితే ప్రధాన నిందితుడిని పట్ట్టుకొస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు ముంబైలోని పోలీసుల అదుపులో ఉన్నాడు..

About The Author