బోరుబావిలో పడిన బాలుడి మృతి
పాపన్నపేట: మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్పల్లిలోని బోరుబావిలో పడిన బాలుడు సాయివర్ధన్ మృతి చెందాడు. 25 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. అనంతరం మృతదేహాన్ని మెదక్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం అయిదు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారమిచ్చారు. ఆక్సిజన్ పైపు లోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ అవేవీ ఫలించలేదు. 150 అడుగుల లోతున్న ఈ బోరుబావిలో సంజయ్ 25 అడుగుల లోతున ఉండొచ్చని భావించి.. బోరు బావికి సమాంతరంగా పొక్లెయిన్లతో గొయ్యితవ్వి బాలుడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే సాయివర్ధన్ ప్రాణాలు కోల్పోయాడు. జిల్లా కలెక్టరు ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం తక్షణం స్పందించి ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.