తెలంగాణలో పది పరీక్షలు రద్దు.. పరీక్షలు లేకుండానే విద్యార్థుల ప్రమోట్…


పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు.
మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లు ఉండగా, అందులో రెండు సబ్జెక్టు లకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించారు.

About The Author