నేడు సీఎం వైఎస్‌ జగన్‌తో సినీపెద్దల భేటీ..

కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్లో వుంది. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా థియేటర్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించకపోవడంతో సినిమాల విడుదల నిలిచిపోయింది. దీంతో విడుదలకు సిద్ధమయిన సినిమాలు ల్యాబ్ లకే పరిమితం అయ్యాయి. సినిమా షూటింగులు లేక, సినిమా పనులు లేక జూనియర్ ఆర్టిస్టులు, సినిమా కార్మికులు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం టీవీ సీరియల్స్, షూటింగులకు షరతులతో అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై చిరంజీవి సీఎం కేసీయార్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా వుంటుందనేది చర్చనీయాంశం అయింది. ఇంతకుముందే నిర్మాతలు కొందరు జగన్ ని కలిశారు. తాజాగా జగన్ మరోసారి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మంగళవారం అమరావతిలో సీఎం జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ కానుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి సీఎం కార్యాలయంకు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సి కళ్యాణ్, సురేష్ బాబు, పీవీపీ, దిల్ రాజు తదితరులు హాజరు కానున్నారు. హీరో బాలయ్యకూడా ఆహ్వానం పంపారు. అయితే వ్యక్తిగత కారాణాలు వలన ఈ సమావేశానికి హాజరు కాలేనని చెప్పారు బాలకృష్ణ. ఇటీవల తెలంగాణ మంత్రి తలసానితో నటులు చిరంజీవి, నాగార్జున భేటీ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో బాలయ్య హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే బాలయ్యను కూడా ఈ సమావేశానికి పిలిచారు. అయితే బాలయ్య రాలేనని ప్రకటించారు..

తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ సినిమా షూటింగ్స్, సినిమా హాల్స్ తెరుచుకునేందుకు అనుమతి కోరనున్నారు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు. సినిమా ఇండస్ట్రీకి విశాఖలో వివిధ మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర పాలనా రాజధానిగా విశాఖను ఎంపికచేసిన జగన్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను కూడా సినీ పెద్దలకు వివరించే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.  

About The Author