రూ.500 బిల్లు కాస్త లక్షలు…రూ.12 లక్షల బిల్లు: మొబైల్ షాపుకు కరెంట్ బిల్లు మోత,
లాక్‌డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీయకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొందరు వినియోగదారులకు బిల్లుల మోత మోగుతోంది. కరెంట్ బిల్లు ఎక్కువ రావడం లేదు అని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించిన కొద్దిసేపటికే.. మహబూబాబాద్‌లో ఓ వినియోగదారుడికి రూ.2 లక్షల బిల్లు వచ్చింది. ఆ తర్వాత ఓ చిన్న షాపుకు మీటర్ షాక్ ఇచ్చింది. అక్షరాల రూ.12 లక్షల కరెంట్ బిల్లు వచ్చినట్టు చూపించింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాలేజీ రోడ్డులో చిన్న మొబైల్ షాప్ ఉంది.
లాక్ డౌన్ వల్ల మూడు నెలలుగా షాపు మూసి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అతని షాపునకు బిల్లు జనరేట్ అయ్యింది. నెల నెల రూ.300 నుంచి రూ.500 వరకు వస్తుండే.. బిల్లు ఈ సారి ఎక్కువే వచ్చింది. అక్షరాల 12 లక్షల 4 వేల 738 రూపాయల వచ్చింది. దానిని చూసిన షాపు ఓనర్ గుండె గుబేల్ మంది. ఇదీ తన బిల్లా..? ఇతరులా అని అర్థం కాలేదు. ఏం చేయాలో పాలుపోలేదు.
రూ.12 లక్షల కరెంట్ బిల్లును తన ఇల్లు, జాగ అమ్మినా కట్టలేనని పేర్కొన్నాడు. బిల్లుపై ఇరుగు పొరుగువారితో చర్చించాడు. స్థానిక విద్యుత్ అధికారిని సంప్రదించాడు. మీటర్‌లో సాంకేతిక లోపం వల్ల ఇంత బిల్లు వచ్చి ఉంటుందని ఆయన చెప్పారు. వాస్తవానికి షాపు ఓనర్‌కి రూ.1000 బిల్లు వచ్చిందని తెలిపారు. చుట్టుపక్కల షాపుల వాళ్లకు సరిగానే బిల్లు జనరేట్ అయ్యిందని.. మొబైల్ షాపు విషయంలో లోపం జరిగిందని చెప్పారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేస్తామని భరోసా ఇచ్చారు.