శ్రీసిటీ పరిసరాల్లో ఈఎస్ఐ సేవలపై కార్మికశాఖా మంత్రి సమీక్ష…


100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు చర్చ
సత్యవేడు, వరదయ్యపాలెం ఈఎస్ఐ క్లినిక్ లలో వైద్యసిబ్బంది ఖాళీలు భర్తీచేయాలని కోరిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం

శ్రీసిటీ పరిసరాల్లో పరిశ్రమల కార్మికులకు అందుతున్న ఈఎస్ఐ సేవలపై సమీక్ష నిమిత్తం రాష్ట్ర కార్మికశాఖా మంత్రి గుమ్మనూరు జయరాం మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పర్యటన ద్వారా కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ, చిత్తశుద్ధి స్పష్టం కావడంతో పాటు ఈ ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. ఆసుపత్రి ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పారిశ్రామిక కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈఎస్ఐ సేవల సమీక్ష సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రితో ఫోన్లో మాట్లాడుతూ సత్యవేడు, వరదయ్యపాలెం మండల కేంద్రాల్లోని ఈఎస్ఐ క్లినిక్ లు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన వైద్య సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

అలాగే శ్రీసిటీకి చెందిన కార్మికులు తడ, సూళ్లూరుపేట పట్టణాలలో అధిక సంఖ్యలో నివసిస్తున్నందున అక్కడ వున్న ఈఎస్ఐ డిస్పెన్సరీల స్థాయి పెంచి, మరిన్ని సేవలు అందించాల్సిన అవసరం ఉందని శ్రీసిటీ ఎండీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఈఎస్‌ఐ క్లినిక్ లలో సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేయడంతో పాటు, తడ, సూళ్లూరుపేట లోని డిస్పెన్సరీల స్థాయి పెంచడానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తడ సమీపంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. భవిష్యత్తులో దీనిని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అన్ని ప్రరిశ్రమలు తమ ఉద్యోగులందరికీ ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఇప్పించాలని, ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్‌ఐ) పథకం గురించి వారికి సరైన అవగాహన కల్పించాలని ఆయన పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కడప ఈఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, కర్నూలు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు, శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About The Author