ఈ బ్లడ్ గ్రూప్ వారు.. కరోనా బారిన తక్కువగా పడుతున్నారట!


కొవిడ్-19 దాదాపు మూడు నెలల నుంచి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ట్రయిల్స్‌ జరుగుతున్నప్పటికి.. విజయవంతమైన వ్యాక్సిన్ బయటకు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ప్రాణాంతకమైన ఈ వైరస్ సోకినప్పటికి అనేక మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. కరోనా వైరస్ సోకిన అందరిలో ఒకే రకమైన లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? 23అండ్‌మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ కూడా దీనిపైనే అధ్యయనం జరుపుతోంది. జన్యు శాస్త్రానికి సంబంధించిన ఈ అధ్యయనం ఇంకా పూర్తి కానప్పటికి.. ప్రిలిమినరీ ఫలితాల్లో తమకు ఓ విషయం తెలిసినట్టు సంస్థ చెబుతోంది. కరోనా బారిన పడుతున్న వారిలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు తక్కువగా ఉన్నట్టు సంస్థ సోమవారం వెల్లడించింది. మిగతా బ్లడ్ గ్రూప్‌లతో పోల్చితే ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో 9 నుంచి 18 శాతం మంది కరోనా బారిన తక్కువగా పడుతున్నారని సంస్థ తెలిపింది. దాదాపు 8 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందన్నారు. అయితే తమ అధ్యయనంలో పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని.. ఇవి కేవలం ప్రారంభ స్థాయిలో వచ్చిన ఫలితాలని సంస్థ పేర్కొంది. ఇదిలా ఉండగా.. మార్చిలో మరో అధ్యయనంలో కూడా సరిగ్గా ఇటువంటి ఫలితాలే వచ్చాయి. ఈ అధ్యయనంలో టైప్ ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు తక్కువ సంఖ్యలో కరోనా బారిన పడితే.. టైప్ ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు తెలిసింది.

About The Author