టిక్‌టాక్ కోసం బతికున్న చేపను మింగి…. యువకుడి మృతి
చెన్నై: టిక్‌టాక్ కోసం ఓ యువకుడు బతికి ఉన్న చేపను మింగడంతో ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం హోసూర్‌లోని పార్వతి నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎస్ వెట్రివల్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం గ్రామ శివారులోని తెర్పట్టాయ్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. టిక్‌టాక్ వీడియో కోసం బతికున్న చేపను మింగాడు. చేప గొంతులో ఇరుక్కపోవడంతో ఊపిరాడక కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
*టిక్‌టాక్ కోసం చెట్టు పైనుంచి కాలువలో దూకి…*
లక్నో: టిక్‌టాక్ కోసం ఓ యువకుడు చెట్టు పైనుంచి కాలువలో దూకి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కట్రా ప్రాంతంలో ముర్షీద్ అహ్మద్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ముర్షీద్ తన స్నేహితులతో కలిసి కాలువ దగ్గరికి వెళ్లాడు. చెట్టు పైనుంచి కాలువతో దూకుతున్నప్పుడు టిక్‌టాక్ వీడియో తీయాలని తన స్నేహితులకు తెలిపాడు. చెట్టు ఎక్కి కాలువలో పల్టీ కొట్టాడు. తలకు నీళ్లలో ఉన్న రాయికి తల బలంగా తగలడంతో రక్తంస్రావమైంది. వెంటనే స్థానికులు ముర్షీద్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి ఫోన్‌ను పరిశీలించగా టిక్‌టాక్ వీడియో తీస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటన జూన్ 8న లక్ష్మీపూర్ ఖేరీ జిల్లా భీర్ ప్రాంతంలో శర్ధ నదిలో ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ముజఫర్‌నగర్‌లో టిక్‌టాక్ వీడియో కోసం గంగా నదిలో దూకి ఓ యువకుడు మృతి చెందాడు.