ప్రత్యేక విమానం ఒక్క ప్రయాణికుడితో వచ్చింది అధికారుల షాక్
చెన్నై: సింగపూర్ నుంచి కోల్కతా మీదుగా చెన్నైకి వచ్చిన ప్రత్యేక విమానంలో ఒకే ప్రయాణికుడున్నాడు. కేంద్రప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులను స్వస్థలానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు కోల్కతా మీదుగా ఓ ప్రత్యేక విమానం చెన్నై చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు దిగేందుకు ఎయిరో బ్రిడ్జ్ విమానానికి అనుసంధానం చేశారు. విమానాశ్రయ అధికారులు ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ విమానం నుంచి చెన్నైకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మాత్రమే దిగడంతో అధికారులు దిగ్ర్భాంతి చెందారు. ఆ వ్యక్తిని విచారించగా సింగపూర్ నుంచి 145 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారని, కొల్కతాలో 144 మంది ప్రయాణికులు దిగగా, తాను మాత్రమే చెన్నై వచ్చానని బదులిచ్చాడు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు క్వారంటైన్లో ఉండాలని సూచించారు.