రూ.1.5 కోట్ల బిల్లు మాఫీ చేసిన హాస్పిటల్..


బాయ్‌లో కరోనా బారిన పడిన తెలంగాణ వాసి 80 రోజులపాటు హాస్పిటల్‌కే పరిమితమయ్యాడు. అతడు కోలుకునే నాటికి బిల్లు 7,62,555 దిర్హమ్‌లు అయ్యింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1.52 కోట్లు. అంత మొత్తం చెల్లించడం అతడి వల్ల కాదని తెలుసుకున్న హాస్పిటల్ యాజమాన్యం బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. అంతేకాదు అతడు హైదరాబాద్ రావడానికి తన వంతు సాయం అందించింది. హాస్పిటల్ యాజమాన్యం, అక్కడి భారతీయ కార్మిక సంఘాలు, భారత రాయబార కార్యాలయం సాయం చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్ వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడ్డాడు. దుబాయ్‌లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సంఘం అధ్యక్షుడు నరసింహ అతణ్ని ఏప్రిల్ 2న దుబాయ్‌లోని అల్ ఖలీజా రోడ్‌లో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. తర్వాత అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో 80 రోజులపాటు చికిత్స అందించాల్సి వచ్చింది.
నరసింహ రోజూ హాస్పిటల్‌కు వెళ్లి అతడి బాగోగుల విషయమై ఆరా తీసేవారు.

జగిత్యాల వాసి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయమై నరసింహ.. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటరీ సుమంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వీరంతా కలిసి ఈ విషయాన్ని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ (లేబర్)లో పని చేస్తున్న రాయబారి హర్జిత్ సింగ్‌కు అతడి పరిస్థితిని వివరించారు. స్పందించిన హర్జిత్ హాస్పిటల్ యాజమన్యానికి లేఖ రాయడంతో.. సానుకూలంగా స్పందించిన హాస్పిటల్ బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. అతడు హైదరాబాద్ రావడానికి సాయం కూడా చేసింది.

కరోనా నుంచి కోలుకున్న జగిత్యాల వాసికి అశోక్ ఉచితంగా ఫ్లయిట్ టికెట్లు ఇవ్వడంతోపాటు తోడుగా కనకయ్య అనే వ్యక్తిని ఇచ్చి పంపారు. ఖర్చుల కోసం రూ.10 వేలు కూడా ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి ఎయిరిండియా విమానంలో శంషాబాద్‌లో దిగిన జగిత్యాల వాసి.. అక్కడి నుంచి నేరుగా సొంతూరు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడు 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉంటున్నాడు.

About The Author