టిటిడి ఔట్‌సోర్సింగ్ కార్మికులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన…


మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన MLC యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు టిటిడి ఉద్యోగ సంఘాల నేత‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌ APCOS లో విలీనం చేయ‌రాద‌ని కోరుతూ టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో ఔట్‌సోర్సింగ్ కార్మిక సిబ్బంది మూడవ రోజు బుధవారం కళ్ళకు గంతలు కట్టుకొని నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా MLC యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ దీక్షా శిబిరానికి చేరుకుని త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ‌జేశారు.

MLC యండపల్లి శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ టిటిడి అనేది ఒక అటానమస్ బాడి. ఇక్కడ పని చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులను APCOSలో కలపాల్సిన అవసరం లేదన్నారు . మీరు చేస్తున్న న్యాయ పరమైన పోరాటానికి నేను మా PDF MLC లు అందరి తరఫున సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు టిటిడి అధికారులకు MLC ల పక్షాన మేము లేఖ వ్రాసి యున్నాము. APCOS లో విలీనం చేయకుండా టిటిడిలోనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టైమ్ స్కేలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌర‌వాధ్య‌క్షులు ఎం.నాగార్జున మాట్లాడుతూ APCOSలో విలీన నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని యాజ‌మాన్యానికి ప‌లుసార్లు విజ్ఞ‌ప్తి చేసినా స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌‌మ‌న్నారు. టిటిడి అవుట్సోర్సింగ్ కార్మికులను APCOSలో కలపడం వల్ల టిటిడి కి ఏమైనా ప్రయోజనముందా? పోనీ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏమైనా ప్రయోజనముందా? ఎవరికీ ప్రయోజనం లేనప్పుడు ఏటా రెండున్నర కోట్ల రూపాయల అదనపు భారము సెస్స్ రూపంలో చెల్లిస్తూ బలవంతంగా కార్మికులను APCOSలో కలపాల్సిన అవసరం ఏమిటని సూటిగా ప్రశ్నించారు.
SFI జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్, నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేసారు. టిటిడిలోని సెంట్ర‌లైజ్డ్ ఔట్‌సోర్సింగ్ సెల్‌ను బలోపేతం చేసి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఇక్క‌డే కొన‌సాగించాల‌ని కోరారు. 10 ఏళ్ల నుండి 15 ఏళ్ల పాటు విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బందికి ఎలాంటి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌కుండా, APCOSలో క‌ల‌ప‌డం వ‌ల్ల అంద‌రిలో అయోమ‌యం నెల‌కొంద‌న్నారు. టిటిడి యాజ‌మాన్యం స్పందించిన త‌మ‌కు త‌గిన న్యాయం చేయాల‌ని కోరారు.

టిటిడి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెంకట్రమణ రెడ్డి, గోల్కొండ వెంకటేశం మాట్లాడుతూ టిటిడి స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి గ‌ల ఒక ట్ర‌స్టు అని, ఇక్క‌డ ప‌నిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటుచేసిన కార్పొరేష‌న్‌లో విలీనం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చేస్తున్న పోరాటాల‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు హరిప్రసాద్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌రికృష్ణ‌, కోశాధికారి నవీన్ కుమార్‌, టిటిడిలోని ప్రెస్‌, అన్న‌దానం, ఉద్యాన‌వ‌న‌, హాస్ట‌ళ్లు, మ్యూజియం, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల సొసైటీల‌కు చెందిన ప్రియాంక, విహరిక, శశికళ, ఓంప్రకాశ్, గీతాంజలి, రామతులసి, నళిని, సురేశ్, కావమ్మ, నాగసుబ్బులు, సుబ్బరత్నమ్మ, కరుణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

జారీ చేసిన‌వారు
హ‌రికృష్ణ‌
ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,
టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం.

About The Author