తిరుపతి MP బల్లి దుర్గాప్రసాద్ మృతి
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బల్లి దుర్గాప్రసాద్ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. 2,28,376 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
సీఎం జగన్ సంతాపం
బల్లి దుర్గాప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణం బాధాకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. ‘ఆయన మంచి మేధావి. రెండు దశబ్దాలుగా ప్రజా జీవితంలో వున్నారు. ఎప్పుడు ప్రజల కోసం పరితపిస్తుంటారు. ఆయన మృతి తీరని లోటు. తిరుపతి అభివృద్ధిలో ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చెదరని ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని సంతాపం ప్రకటించారు.బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం కలచివేసిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దుర్గాప్రసాద్ మరణంతో మంచి నేతను జిల్లా కోల్పోయిందని నెల్లూరు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గూడూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారని గుర్తు చేసుకున్నారు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కాకాణి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు విజయసాయిరెడ్డి, రెడ్డప్ప, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సంతాపం ప్రకటించారు.