కోడలు ఆత్మహత్య…..అవమానంతో మామ ఆత్మహత్య


చిత్తూరు జిల్లా భాకరాపేట పోలీసుస్టేషన్ పరిధిలోని బోడిరెడ్డిగారి పల్లెలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న హరిత(23)
కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కోడలు హరిత ఆత్మహత్య చేసుకోవటాన్ని అవమానంగా భావించిన ఆమె మామ రామిరెడ్డి
(67) ఆత్మహత్య చేసుకున్నారు.

చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన పాపిరెడ్డి రెండో భార్య కుమార్తె హరిత(23)ను అదే గ్రామానికి
చెందిన రామిరెడ్డి, పూర్ణమ్మ కుమారుడు ఆనందరెడ్డికి ఇచ్చి 4 నెలల క్రితం వైభవంగా వివాహం చేశారు.

ఆనంద రెడ్డి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుండగా…హరిత అరగొండ అపోలో ఆస్పత్రిలో పనిచేసేది. వివాహమైన నెల
నుంచే హరితకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఆనంద్ రెడ్డి లాక్‌ డౌన్‌ కారణంగా పెళ్లయినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ విధులు
నిర్వహిస్తున్నాడు.
హరితను తరచూ అనుమానించి, అవమానించిన భర్త నెల క్రితం ఆమెను ఉద్యోగం మాన్పించాడు. హరిత ప్రస్తుతం 3నెలల గర్భిణీ. ఈ
క్రమంలో అక్టోబర్21, బుధవారం రాత్రి భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం ఆనందరెడ్డి రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
గురువారం తెల్లవారు ఝూమున హరిత ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి గురువారం రాత్రి 9 గంటలకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తన బిడ్డ మృతికి అల్లుడు
ఆనందరెడ్డి, అత్త పూర్ణమ్మ, మామ రామిరెడ్డి కారణమంటూ మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు
చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో శుక్రవారం తెల్లవారు ఝూమున పొలానికి వెళ్లి వస్తానని వెళ్లిన హరిత మామ రామిరెడ్డి ఎంత సేపటికి తిరిగి రాలేదు. దీంతో
కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా అక్కడ మామిడి తోటలో చెట్టుకు డ్రిప్ పైపులతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.
కోడలి మరణంతో అవమాన భారం తట్టుకోలేక అతడు బలవన్మరణం చెందినట్టు ఎస్‌ఐ చెప్పారు.

About The Author