శ్రీవారి ఆలయ నిర్మాణం..


క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.
శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి.
ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి
1 వ ప్రాకారం :-
మహాద్వార గోపురం :- (ఇత్తడి వాకిలి)*
శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే …. ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం.
*పడికావలి, సింహద్వారం, ముఖద్వారం*
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి.
దీనినే తమిళంలో *”పెరియ తిరువాశల్‌”* అని కూడా అంటారు. *అనగా *పెద్దవాకిలి అని అర్థం.*
ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.
ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాళ్ళు కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.
ఈ వాకిలి దక్షిణవైపున గోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం ఉంటుంది.
*శంఖనిధి – పద్మనిధి*
మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. వీరే శ్రీవేంకటేశ్వరుని సంపదలకు నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణదిక్కున ఉన్న రక్షక దేవత రెండుచేతుల్లోనూ రెండు శంఖాలు ఉంటాయి ఈయన పేరు శంఖనిధి, కుడివైపున ఉన్న రక్షకదేవత చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి ఈయన పేరు పద్మనిధి.
*కృష్ణదేవరాయమండపం :-
మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో 27′ ×25′ కొలతలు ఉన్న ఎతైన మండపమే కృష్ణరాయ మండపం. దీనినే *ప్రతిమా మండపం* అని కూడా అంటారు.
ఈ మండపం లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి.
అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట *అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని* నిర్వహించాడు.
*అద్దాలమండపం*
ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో, ఎతైన అధిష్టానంమీద నిర్మింపబడి ఉన్న దీన్నే అద్దాలమండపమని
అయినామహల్ అని అంటారు. 43’×43′ కొలతలున్న ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. ఈ అరల ప్రాంతాన్నే *ప్రసాదం పట్టెడ* అంటారు.
తులాభారం :-
శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ గాని తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తారు.
రంగనాయక మండపం :-
కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప శిల్ప శోభితమై విరాజిల్లుతూ ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.
తిరుమలరాయమండపం:-
రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాలు, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి మచ్చుతునక ఈ తిరుమలరాయ మండపం.
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించాడు (సాళ్వ నరసింహ మండపం). శ్రీస్వామి వారికి *”అన్నా ఊయల తిరునాళ్ళ”* అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం క్రీ.శ. 1473 లో ఈ మండపం నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.
అణ్ణై అనగా తమిళంలో *హంస*.? బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.
*రాజ తోడరమల్లు:-
ధ్వజస్తంభం మండపానికి 10 అడుగుల దూరంలో స్వామి వారికి నమస్కరిస్తున్నట్లు 3 విగ్రహాలు ఉంటాయి. సహజంగా కళ్యాణం ముగించుకున్న భక్తులు సాధారణ భక్తులతో కలిసే మార్గంలో ఉంటాయి.
అవి రాజా తోడరమల్లు
అతని తల్లి మోహనాదేవి
అతని భార్య పితాబీబీ విగ్రహాలు.
ఈయన అనేక సంవత్సరాలు తిరుమలను దుండగుల బారినుండి రక్షించారు.
*ధ్వజస్తంభ మండపం :-
ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు.
ధ్వజస్తంభం:-*
వెండివాకిలి ఎదురుగా సుమారు15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంవలెనున్న ఎతైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం.
బలిపీఠము :-
ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు *బలిని (అన్నాన్ని )* ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.
క్షేత్రపాలక శిల (గుండు) :-
ధ్వజస్తంభం కు ఈశాన్య (north – east) మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే *క్షేత్రపాలక శిల* అంటారు.
ఇది రాత్రిపూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికితాళం వేసి తర్వాత ఈ శిలపై ఉంచి నమస్కరించి మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులను తీసుకువెళతారు.
సంపంగి ప్రాకారం :-
మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం *స్థలవృక్షం సంపంగి*. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.
కళ్యాణ మండపం :-
సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటు చేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది.
*ఉగ్రాణం :-
స్వామివారి పూజా సంభారాలు నిల్వ ఉంచేగది.
సంపంగి ప్రదక్షిణకు (north west) వాయువ్య మూలగా ఉంటుంది.
విరజానది :-
వైకుంఠంలోని పరమ పవిత్రమైన నది శ్రీవారి పాదాలక్రిందగా ప్రవహిస్తూ ఉంటుందని నమ్మకం.
ఆలయం లోపలి బావులలో ఈనది నీరు ప్రవహిస్తుందని అందుకే ఆలయ బావులలోని నీరు పరమ పవిత్రమైనవిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వాడతారు.
నాలుగు స్థంభాల మండపం :-
సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వ నరసింహ రాయలు ఆయన భార్య , ఇద్దరు కుమారులు పేర స్థంభాలు కట్టించాడు.
పూలబావి :-
పూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామి వారికి ఉపయోగించిన పూల నిర్మాల్యాలన్నీ ఇందులో వేస్తారు.
దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్ళేటపుడు ఎత్తైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.
వగపడి :-
భక్తులు సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది.
ముఖ మండపం :-
అద్దాల మండపంనకు ముందుభాగంలో ఉంటుంది.
కళ్యాణం చేయుచుకున్న భక్తులకు ప్రసాదాలు దీని ప్రక్కమార్గంలో అందచేస్తారు.
2 వ ప్రాకారం :-
వెండి వాకిలి – నడిమి పడికావలి…
ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామి వారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశ ద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు.
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న శిల్పం ఉంది.
విమాన ప్రదక్షిణం :-
వెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అనికూడా అంటారు. సుప్రభాత సేవ జరిగేటపుడు వెలుపల అంగప్రదక్షిణం చేసే భక్తులు కూడా ఉంటారు.
ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాధ స్వామి, వరదరాజస్వామి, ప్రధానవంటశాల,
పూలబావి,
అంకురార్పణ మండపం,
యాగశాల,
నాణాల పరకామణి,
నోట్ల పరకామణి,
చందనపు అర
విమాన వేంకటేశ్వర స్వామి,
రికార్డుల గది,
భాష్యకారుల సన్నిధి,
యోగనరసింహస్వామి సన్నిధి,
ప్రధాన హుండి
విష్వక్సేనుల వారి ఆలయం
మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్ళుగా పేర్కొంటున్నారు.
శ్రీరంగనాథుడు :-
వెండి వాకిలి గుండా లోపలకు ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపైన కనిపించేది శ్రీరంగనాథుడు. ఈయనకు పైన వరదరాజస్వామి క్రింద వెంకటేశ్వరస్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి.
అంగప్రదక్షిణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.
వీనినే పొర్లుదండాలు అంటారు.
శ్రీ వరదరాజస్వామి ఆలయం :-
విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో (సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామి వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది.
బంగారు బావి :-
దర్శనానంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడంతో ఉంటుంది. ఇందులోని నీటినే స్వామి వారి అభిషేకాలకు ప్రసాదాలకు వాడతారు. ఇందులో వైకుంఠం లోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనది గా చెపుతారు.
వకుళాదేవి :-
బంగారుబావి ప్రక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది.
శ్రీవారి తల్లి (పెంచిన). ద్వాపరయుగంలో యశోదయే ఈ కలియుగంలో స్వామి వారి కళ్యాణం చూడడానికి వకుళాదేవిగా అవతరించింది.
అంకురార్పణ మండపం :-
బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు.
ఇంకా గరుడ, విష్వక్సేనుల, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.
యాగశాల :-
హోమాది క్రతువులు నిర్వహించే ప్రదేశం. కాని ఇప్పడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.
సభ అర :-
కైంకర్యాలకై ఉపయోగించే బంగారు వెండి పాత్రలు కంచాలు గొడుగులు ఉంచే ప్రదేశం.
ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విశనకర్రలను కూడా ఇక్కడే భద్రపరుస్తారు.
సంకీర్తన భాండాగారం :-
సభ అర ప్రక్కనే ఉన్న గది. దీనికి ఇరువైపులా తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్ళపాక వంశం వారు రచించిన దాదాపు 32000 సంకీర్తనలను భద్రపరిచారు.
సాధుసుబ్రమణ్యశాస్త్రి* గారి విశేష కృషి వలన ఈనాడు మనం వాటిని మననం చేసుకోగలుగుతున్నాము.
భాష్యకార్ల సన్నిధి :-
ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి.
తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ళ పర్వతం.
ఈనాటికి కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు.
ప్రధాన వంటశాల (పోటు) :-
విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.
పరకామణి :-
స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదు లెక్కించే ప్రదేశం.
చందనపు అర :-
స్వామి వారికి సమర్పించే చందనాన్ని భద్రపరిచే ప్రదేశం.
ఆనందనిలయ విమానం :-
ఆనందనిలయం పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు.
గరుత్ముంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుండి భూమిమీదకు తీసుకు వచ్చారని చెప్తారు. దీనిమీద దాదాపు 64 మంది దేవతా ప్రతిమలు ఉన్నట్లు చెపుతారు.
విమాన వెంకటేశ్వరస్వామి :-
గోపురంపై వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామివారు.
రికార్డు గది :-
స్వామి వారి ఆభరణాలు వివరాలు, జమ ఖర్చులు భద్రపరచు గది.
వేదశాల :-
రికార్డు గది ప్రక్కనే వేద పఠనం చేసే పండితులు ఉండేగది. ఇక్కడే మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.
శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి :-
రామానుజాచార్యులుచే ప్రతిష్టితం చేయబడింది.
శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం. క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది.
*’అళగియ సింగర్‌’ (అందమైన సింహం)* అని, *వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం)* అని ప్రస్తావన ఉంది.
చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండడం ప్రత్యేకం.
ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.
శంకుస్థాపన స్థంభం :-
రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.
పరిమళ అర :-
శంకుస్థాపన స్థంభంకు వెళ్ళే దారిలో ఉంటుంది. స్వామి వారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.
శ్రీవారి హుండి :-
భక్తులు కానుకలు వేసే ప్రాంతం.
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగిననూ మార్పు చెందని ఒకేఒక స్థలం. దీని క్రింద శ్రీచక్రయంత్రం ధనాకర్షణ యంత్రం ఉందని నమ్మకం.
బంగారు వరలక్ష్మి :-
హుండి ఎడమగోడపై బంగారు లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఈవిడ భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.
కటహ తీర్థం :-
అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టి లాంటి నిర్మాణం. ఇందులో స్వామి వారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.
విష్వక్సేన :-
హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ప్రస్తుతం ఈ విగ్రహం అంకురార్పణ మండపంలో ఉంది.
ఘంట మండపం :-
బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు.
పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు. దీనిని *ఘంటపని* అనేవారట. ఈ గంటలననుసరించే స్వామి వారి ఆహారసేవనలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం సేవించేవారట.
ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.
గరుడ సన్నిధి :-
మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారులు గారు ఉన్న మండపం. బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.
ద్వారపాలకులు :-
బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.
3 వ మూడవ ప్రాకారం :-
బంగారువాకిలి :-
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.
స్నపన మండపం :-
బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ. 614 లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే *తిరువిలాన్‌కోయిల్‌* అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.
ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునకు ఆరోజు పంచాంగం, చేయవలసిన పూజాదికాలు, క్రితంరోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు.
దీనిలో కుడివైపున అనగా దక్షిణ దిక్కున హుండీ మరియు ఎడమవైపున అనగా ఉత్తర దిక్కున శ్రీవారి ఆభరణాలు భద్రపరిచే గది ఉంటాయి.
రాములవారి మేడ :-
స్నపనమండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపుల ఎత్తుగా కనిపించే గద్దెలు. *”రాములవారిమేడ”*. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం.
ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.
శయనమండపం :-
రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.
కులశేఖరపడి :-
శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి.
పడి అనగా మెట్టు, గడప అని అర్థం.
ఆనందనియం :-
కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ” *గర్భాలయం* ” అనికూడా అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :-
గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని *”స్థానకమూర్తి”* అంటారు.
అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”…. *ధ్రువమూర్తి* ….” అని, *”ధ్రువబేరం”* అని కూడా అంటారు.
శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల స్వయంభూమూర్తి.
ఈ మూలమూర్తికి ప్రతినిధులు గా
కొలువు శ్రీనివాస మూర్తి
భోగ శ్రీనివాస మూర్తి
ఉగ్ర శ్రీనివాస మూర్తి
మలయప్ప స్వామి
అను ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఇంకా
సీతారామలక్ష్మణులు
శ్రీకృష్ణ రుక్మిణి లు
చక్రతాళ్వారులు
శాలిగ్రామ శిలలు ఉన్నాయి.
(స్వామికి ప్రతిరుపాలుగా వీనికి నిత్య అభిషేకాలు జరుగుతాయి.)
ముక్కోటి ప్రదక్షిణం :-
రాములవారి మేడ చుట్టూ చేసే ప్రదక్షిణం.
వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశినాడు ఈ ద్వారం గుండా దర్శనం ఉంటుంది.

About The Author