షర్మిల పార్టీ సంగతేమిటి?
వైఎస్ పుత్రిక షర్మిల తెలంగాణలో స్వంత పార్టీ పెడతారని వార్తలు బయటకు వచ్చాయి. నిజానికి ఇలాంటి వార్తలు చిరకాలంగా వినిపిస్తున్నాయి కానీ ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆంధ్రజ్యోతి దీన్ని సీరియస్ గా తీసుకుని, దానికి తమ స్టయిల్ కవిత్వం అద్దేసి కథనం వండారు.
అయితే ఒక రోజు ఆలస్యంగా షర్మిల ఓ ప్రెస్ నోట్ ఇచ్చి ఖండించారు. కానీ విడుదల చేసిన ప్రెస్ నోట్ సమగ్రంగా లేకపోవడం కాస్త ఆలోచింపచేసేలా వుంది. ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండిస్తున్నామని, కుటుంబ వ్యవహారాలపై కథనాలు రాయడం ఏ ఛానెల్ కు, ఏ పత్రికకు సరికాదని పేర్కొన్నారు.
అంతే తప్ప పార్టీ పెట్టే ఆలోచన లేదు అని స్పష్టంగా ప్రకటించలేదు. ఈ ఖండనను సాక్షి పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. ఫ్యామిలీ విషయాలు పత్రికలు, ఛానెళ్లు ప్రచురించకూడదన్న షర్మిల పాయింట్ ఆలోచింపచేసేదే.
అయితే గతంలో సాక్షి పత్రిక కూడా ఇలాంటివి చేసింది. రామోజీ రావు ఫ్యామిలీ వ్యవహారాలు సాక్షిలోనే రచ్చకెక్కాయి. ఆ సంగతి అలా వుంచితే షర్మిల పార్టీ పెట్టే ఆలోచనలోనే వున్నారని, అయితే అది ఇప్పట్లో కాదని తెలుస్తోంది.
దానికి ఇంకా టైమ్ వుందని, మరీ పది రోజులు, నెలరోజుల్లో బయటకు వచ్చేది కాదని తెలుస్తోంది. వైఎస్ జయంతి లేదా వర్థంతి కి అలాంటి వార్త బయటకు రావచ్చు అని భోగట్టా.