బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ బడ్జెట్: విజయసాయి రెడ్డి


పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్టీ లోక్‌సభాపక్ష నేత పి.వి. మిధున్‌ రెడ్డి, సహచర పార్టీ ఎంపీలతో కలిసి సోమవారం ఇక్కడి విజయ్‌ చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిందని ఆయన అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను బడ్జెట్‌లో విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఇది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందని అన్నారు.
ఎన్నడూ లేనటుంవటి బడ్జెట్‌ వస్తున్నదంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు గత బడ్జెట్‌లకు ఏమాత్రం భిన్నంగా లేదన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు సంబంధించి తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున వాటికి వేల కోట్ల రూపాయల విలువైన రోడ్ల ప్రాజెక్ట్‌లను బడ్జెట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు.
అలాగే మెట్రో రైల్‌ విషయానికి వస్తే… కొచ్చి, బెంగుళూరు, చెన్నై, నాగపూర్‌లలో మెట్రో రైల్‌ కోసం వేల కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్‌ కావాలని అడుగుతున్నాం. కానీ దాని గురించి బడ్జెట్లో ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రాజెక్టు విషయంలో ఆత్మనిర్భర్‌ ఆంధ్రప్రదేశ్‌ ఊసే లేదని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో రూ. 55,656 కోట్ల సవరించిన అంచనాల గురించి కూడా బడ్జెట్‌లో చెప్పలేదు. దీని మీద నెలకొన్న అస్పష్టతను తొలగించే ప్రయత్నం బడ్జెట్‌లో చేయలేదు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు.
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఖరగ్‌ఫూర్‌ నుంచి విజయవాడ, నాగపూర్‌ నుంచి విజయవాడ సరుకు రవాణా కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కానీ దానివల్ల రాష్ట్రానికి ఒరికే ప్రయోజనం ఏమీ ఉండదు.
కడప-బెంగుళూరు రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని ఇప్పటికి అనేకమార్లు అడిగాం. ఆ కేటాయింపులపై ప్రస్తావన లేదు. ఉద్యానవన పంటల రవాణా కోసం మరిన్ని కిసాన్ రైళ్లు అడిగాం. దేశం మొత్తంమీద 11.8% పండ్లు ఆంధ్రప్రదేశ్‌లోనే పండుతాయి. కాబట్టి దేశంలోని వివిధ నగరాలకు వాటిని త్వరితగతిన రవాణా చేసేందుకు ఎక్కువ కిసాన్ రైళ్లు నడపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మొహన్‌ రెడ్డి కేంద్రాన్ని అడుగుతూ వచ్చారు. బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదని విజయసాయి రెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కానీ, ఈనాటి బీజేపీ ప్రభుత్వానికి కానీ మొదటి నుంచి ఆసక్తి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. హోదా విషయాన్ని కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాలపై నెట్టివేస్తూ వచ్చిందని అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని కోరుతున్నాం. కానీ బడ్జెట్‌లో దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదని చెప్పారు. ఈ బడ్జెట్‌ చాలా నిరాశజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ఆశించిన స్థాయిలో ఈ బడ్జెట్‌లేదు.
ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారాయన. దీనిని కేంద్ర బడ్జెట్ అని పిలిచే బదులు. వెస్ట్‌ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్‌ను పరిశీలించి చూస్తే ఇది మిగతా రాష్ట్రాలకు వర్తించదేమో అన్న అనుమానం కలుగుతోందని అన్నారు.

About The Author