ఫొటోగ్రఫిలో శ్రీనివాసరెడ్డికి కేరళ ప్రభుత్వ అవార్డు
ప్రపంచ వెట్ లాండ్స్ డే సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెట్ లాండ్ అధారటి జాతీయస్థాయిలో ఫొటోగ్రఫి పోటీ నిర్వహించింది. “నీరు, చిత్తడినేలలు మరియు జీవితం” (Water wetland & Life) అన్న అంశంపై భారతదేశంలోని రామ్ సార్ ప్రదేశాలలో నివాసం ఉండే పక్షులపై పోటీలను ఆహ్వానించింది. జాతీయస్థాయిలో పెద్దసంఖ్యలో వచ్చిన ఎంట్రీలను పరిశీలించిన న్యాయమూర్తులు ఈ ఏడాది ముగ్గురిని అవార్డులకు ఎంపికచేసింది. అందులో మన తెలుగురాష్ట్రాలనుండి ఫొటోజర్నలిస్ట్ టి. శ్రీనివాసరెడ్డి పంపిన అవర్ సేఫ్ హోమ్ ( Our Safe Home ) అన్న టైటిల్ చిత్రం ఎంపికైంది. కొల్లేరు సరస్సులో చెట్లకొమ్మలపై నివాసం ఏర్పాటుచేసుకుని ఇక్కడే పిల్లలకు జన్మనిచ్చి వాటిని తిరిగి ఎంతో దూరప్రాంతమైన సైబీరియా దేశానికి పయనమవడం ప్రతిఏడాది క్రమం తప్పకుండా జరుగుతుంది. గత రెండున్నర దశాబ్దాలుగా శ్రీనివాసరెడ్డి కొల్లేరు, గుంటూరు వద్దగల ఉప్పలపాడు, నెల్లూరులోని నేలపట్టు ప్రాంతాలకు వచ్చే విదేశీ పక్షులపై దృష్టిసారించి పలు చిత్రాలు తీశారు. అవార్డు క్రింద నగదు, ప్రశంశాపత్రం, జ్ఞాపికను పంపుతున్నట్లుగా నిర్వాహకులు శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలుపుతూ తెలియజేశారు.