విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటుపరం అడ్డుకుంటాం గంటా శ్రీనివాసరావు


విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటుపరం అవుతుందనే వార్త రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురి చేసిందని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా అవసరమైతే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలన్నారు. “ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించాం. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేవని కుంటి సాకు చూపి ప్లాంట్‌ని వంద శాతం ప్రైవేటుపరం చేయడం దారుణం. ఈ విషయంలో కేంద్రం ఆలోచన సరైంది కాదు. అనేక ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్‌వోరు గనులు ఇస్తున్నందున.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలి. దీనిపై సీఎం జగన్‌ స్పందించాలి. అవసరమైతే ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి” అని గంటా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. విశాఖను రాజధాని చేస్తామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడటం లేదని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. జగన్‌మోహన్‌ రెడ్డి.. కేసులకు భయపడి కేంద్రం చెప్పినట్టు ఆడుతున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అంగుళం ప్రైవేటీకరణ చేసినా సహించేది లేదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని ఎంపీ రామ్మోహన్‌నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నా వైసీపీలో ఉన్న 28 మంది ఎంపీలు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

About The Author