త్వరలో తెలంగాణ బ్రాండ్‌ మాంసం…


రాష్ట్రంలో మాంసం వినియోగ దారులకు నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు త్వరలో తెలంగాణ బ్రాండ్‌ మాంసం విక్రయాలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో.. నీలి, శ్వేత, పింక్‌ విప్లవాలతో పశుసంవర్ధక శాఖ దేశంలోనే ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న రాష్ట్రం.. జీవాలకు వైద్య సేవలు అందించేందుకు సంచార పశువైద్య శాలలను ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో తెలంగాణ పశుసంవర్ధక శాఖను ప్రశంసించిందన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీతో గొర్రెలు, మత్స్య సంపద భారీగా పెరిగిందన్నారు. 5 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంబించిన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. మొదటి విడతలో డీడీలు చెల్లించిన 28 వేల మందికి గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమం పారదర్శకంగా జరిగేందుకు అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ పశుసంవర్ధక శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, అన్ని విధాలుగా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారని మంత్రి తలసాని వివరించారు. ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని.. మూగ జీవాలకు సేవచేయడమంటే భగవంతుడికి సేవ చేసినట్లేననిమంత్రి తలసాని అన్నారు

About The Author