సూపర్ స్టార్.. దెబ్బ అదుర్స్ కదూ..!


సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ రాజకీయ పార్టీని పక్కనపెట్టేసరికి.. డీఎంకే, అన్నాడీఎంకే సహా.. తమిళనాట ప్రధాన పార్టీలన్నీ పండగ చేసుకున్నాయి. సూపర్ స్టార్ పార్టీ పెడితే ఆయన దెబ్బకి లెక్కల్లో తేడా వచ్చేస్తుందని, రజినీ సీఎం అయినా కాకపోయినా, సీఎం ఎవరూ కావాలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతారని అందరూ నమ్మారు.

కమల్ హాసన్ పార్టీని పూర్తిగా లైట్ తీసుకున్నా.. రజినీ పెట్టబోయే పార్టీ గురించి మాత్రం నాయకులు కంగారుపడ్డారు. తీరా రజినీ వెనక్కి తగ్గేసరికి అందరిలో ఒకటే ఆనందం.

అయితే ఆ ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలిచే అవకాశం లేదని తమిళనాట రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రజినీ అండదండలతో.. ఆయన సపోర్ట్ తోనే అర్జునమూర్తి అనే వ్యక్తి పొలిటికల్ పార్టీ ప్రకటించబోతున్నట్టు సమాచారం.

ఎవరీ అర్జున మూర్తి..?

తమిళనాడు బీజేపీ మేథో విభాగం అధ్యక్షుడిగా చాన్నాళ్లు పనిచేశారు అర్జున మూర్తి. ఆయనకు రాజకీయ అనుభవం దండిగానే ఉంది. కొత్త పార్టీ పెట్టాలనుకున్న రజినీ ముందుగా అర్జున మూర్తినే చేరదీశారు. పార్టీ పెట్టడానికి అన్ని వ్యవహారాలు సిద్ధం చేసుకున్న తర్వాత రజినీ చెన్నైలో ఒకే ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఆ కార్యాలయానికి రజినీ సన్నిహితుడు అర్జునమూర్తి కోఆర్డినేటర్. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఒకరకంగా రజినీకి రైట్ హ్యాండ్ గా పనిచేశారు. అనారోగ్య కారణంతో సూపర్ స్టార్ వెనకడుగేసిన తరుణంలో అర్జున మూర్తి ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పలేదు.

అర్జున మూర్తి వెనక అరుణాచలం..

రజినీకి రైట్ హ్యాండ్ గా ఉన్న అర్జున మూర్తి ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు. రజినీ పేరుని ఆయన వాడుకుంటారో లేదో తెలియదు కానీ.. మూర్తికి వెనక బ్యాక్ బోన్ గా ఉన్నది మాత్రం ఆయనేనని తెలుస్తోంది. ఇటీవల కొంతకాలంగా రజినీతో అర్జున మూర్తి మంతనాలు జరుపుతున్నారని, నేరుగా రజినీ పార్టీ వ్యవహారాల్లో కలుగజేసుకోరని, ఆయన అండదండలతోనే పార్టీ నడుస్తుందని అంటున్నారు.

ఒకరకంగా రజినీ నేరుగా తన పేరు బైటకు రాకుండా అర్జున మూర్తితో ఓ ట్రయల్ నడుపుతున్నట్టు కూడా సమాచారం. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే, అర్జున మూర్తి పార్టీ పెట్టి కాస్తో కూస్తో ప్రభావం చూపగలిగితే.. ఆ తర్వాత రజినీ నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కూడా ఉంటాయి.

త్వరలో భారీ బహిరంగ సభ ద్వారా అర్జునమూర్తి పార్టీ ప్రకటిస్తారని తెలుస్తోంది. రజినీ అభిమానులు కూడా ఈ వేడుకకు భారీగా హాజరవుతారని అంటున్నారు. ఆయనొచ్చినా, ఆయన తరపున ఆయన ఫ్యాన్స్ వచ్చినా ప్రజలు ఒకే రకంగా ఆదరిస్తారో లేదో చూడాలి.

About The Author