ఎవరి రాజన్న? ఎక్కడి రాజ్యం?


అక్క తనే వచ్చిందో లేక అన్న పంపాడో మాకు అనవసరం. అక్కోస్తే చీరె-సారే ఇచ్చి గౌరవిస్తాం. అన్నొస్తే ఒకపూట భోజనం పెట్టి గౌరవిస్తాం. అంతేకాని నెత్తికెక్కించుకొని రాజ్యాధికారం ఇస్తామని కలలు కనొద్దు. తెలంగాణకు వైఎస్ చేసిన ద్రోహం అప్పుడూ మర్చిపోలేదు, ఇప్పుడూ మర్చిపోలేదు, రేపుకూడా గుర్తుంచుకుంటాం. మీ రాజన్న రాజ్యాన్ని ఇడుపులపాయలో స్థాపించుకోండి!
___________________________________________

వైఎస్సార్‌ను తెలంగాణ ద్రోహి అనకుండా దేహీ అనమంటారా? చరిత్రంటే “యాత్ర” సినిమా కాదు, మనకు నచ్చినట్టు తీసి జనాలను నమ్మించడానికి. చరిత్ర చాలా చెడ్డది, అది ఎవడు చెప్పినా మారదు, ఎవరి మాట వినదు. ఉన్నది ఉన్నట్టు, ముఖం మీద కొట్టినట్టు చెప్తుంది. అధికారంలోకి రావడానికి తెలంగాణను వాడుకున్నది, అధికారం వచ్చాక నేను అడ్డమూ కాదూ, నిలువూ కాడు అని పుల్లవిరుపు కామెంట్లు చేసింది మర్చిపోయినట్టున్నారు. చెప్పానుగదా, చరిత్ర చాలా చెడ్డది….. గుర్తుచేయమంటారా?

1) 2004కు ముందు చిన్నారెడ్డి(వనపర్తి ఎమ్మెల్యే)తో తెలంగాణ Legislatures Forum పెట్టించింది ఎవరు? 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తెలంగాణ కోసం సంతకం చేయించి ఒకే దెబ్బతో అటు కేసీఆర్ ఉద్యమాన్ని తగ్గించడానికి, సొనియమ్మ దృష్టిలో సమర్ధతను నిరూపించుకోడానికి, తెలంగాణ ప్రజల దృష్టిలో మంచోడు అనిపించుకోడానికి తెలంగాణను వాడుకున్నదీ చరిత్రే!

2) ఎం.సత్యనారాయణ రావు (MSR)ను రెచ్చగొట్టి, కేసీఆర్‌తో రాజీనామా సవాల్ విసిరి, కరీంనగర్ లోక్‌సభ ఉప-ఎన్నిక అనే వంకతో, “కేసీఆర్ ఓడితే తెలంగాణ ఉద్యమమే లేదు” అనే స్థాయిలో తెలంగాణ ఎమ్మెల్యేలతో ప్రగల్భాలు పలికించింది కూడా చరిత్రే! కరీంనగర్ బిడ్డలు కేసీఆర్‌ను గెలిపించి మూహ్-తోడ్ జవాబిచ్చింది కూడా చరిత్రే!

3) 10 మంది టీఆరెస్ ఎమ్మెల్యేలను చీల్చి, అటు పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చింది కూడా చరిత్రే! అతను చీల్చిన మందాడి సత్యనారాయణ రెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, బండారు శారా రాణి, దుగ్యాల శ్రీనివాస రావు………. ఇంక చాల్లే మొత్తం పది మంది ఎమ్మెల్యేల పేర్లు ఇప్పుడెందుకు. వాళ్లు కేసీఆర్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని మోసం చేసి చివరకు చరిత్రగర్భంలో కలిసిపోవడం కూడా చరిత్రే!

4) తెలంగాణ ఇవ్వాలని సంతకాలు చేయించి, అధికారంలోకి రాగానే “రెండో SRC వేసి, దేశంలో అన్ని రాష్ట్రాల డిమాండ్లు కూడా పరిశీలించాలి” అని కొత్త వాదన లేవదీసింది కూడా చరిత్రే!

5) అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని (Regional Development Board) పెట్టి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డిని ఆ మండలికి Chairmanను చేసి దానికి నిధులు కాదు కదా, కనీసం ఆఫీసు, టేబుల్, కుర్చీ కూడా ఇవ్వలేదు. అసలు ఆ తెలంగాణ మండలి పెట్టిందే మన స్వరాష్ట్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి అని స్వయంగా ఉప్పునూతలే చెప్పిండు. అదికూడా చరిత్రే!

6) PV Narasimha Rao బతికున్నప్పుడు, అదికూడా ప్రధానిగా ఉన్నాప్పుడు కర్నూలులో ఆయన మీద వేయించిన చెప్పులు కూడా చరిత్రే! అదే పీవీ చనిపోతే, ఆ మహానుభావుడి పార్థీవ దేహాన్ని గౌరవించని అహంకారం కూడా Necklace Road సాక్షిగా చరిత్రే! గాంధీ కుటుంబాం మీద ఉన్న విధేయతను చాటుకోడానికి పీవీ మరణాన్ని కూడా వాడుకోవడం….. అబ్బో అది కూడా చరిత్రే!

7) చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడానికి హైదరాబాద్ పాతబస్తి అల్లర్లు చేయించారని వచ్చిన ఆరోపణలు కూడ చరిత్రే!
8) పోతిరెడ్డిపాడుకు రంధ్రం పెట్టి తెలంగాణ నీళ్లను దోపిడీ చేసిన దొంగ కాలువ కూడా చరిత్రే! రాజోలిబండ డైవర్షన్ స్కీంను వివాదస్పదం చేసింది, నీటి పంచాయితీలు వస్తాయని కొత్త కొత్త గొడవలు మొదలుపెట్టింది కూడా చరిత్రే!

9) పంచెకట్టును, పొలిటికల్ గ్లామర్‌ను జనం మెచ్చుకున్నారు, ఒకటో రెండో పథకాలు కూడా నచ్చాయి. కాని అవి తెలంగాణ కోసం కాదు కదా? అందరికీ పెట్టిన స్కీములు తెలంగాణకు కూడా వర్తించాయి. దాన్ని Collateral Benefit అంటారు. మేము కొంత అమాయకులం కాబట్టి, సాఫ్ట్‌వేర్ తెచ్చినందుకే మీరు బాగు పడ్డారు అని చంద్రబాబు చెప్తే ఎలా గుడ్డిగా నమ్మినామో, అలాగే వైఎస్ పథాకాలు కూడా తెలంగాణ కోసమే అనుకున్నం. ఇది కూడా చరిత్రే!

10) కాబట్టి…. వైఎస్ మీకు దేవుడైతే పూజించుకోండి. అంతేగాని ఇప్పుడున్న తెలంగాణ నాయకుల మీద మీకున్న వ్యతిరేకతను, వైఎస్ మీద అభిమానంగా మార్చుకోకండి. మీరు YSRCPలో చేరి రాజాకీయాలు చేయండి, సాక్షీ mediaలో జర్నలిజం వెలగబెట్టండి, తెలంగాణకు మాత్రం అతను శాశ్వత శతృవే. ఇదే అసలు చరిత్ర!

About The Author