దివంగత నాయకురాలు జయలలిత నెచ్చెలి శశికళ రాకతో తమిళనాట హీటె్కిన రాజకీయాలు
తలకిందులు తపస్సు చేసినా వారి ఆటలు సాగవు.. శశికళ వర్గానికి సీఎం పళనిస్వామి సీరియస్ వార్నింగ్..
దివంగత నాయకురాలు జయలలిత నెచ్చెలి శశికళ రాకతో తమిళనాట రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది. జయలలిత వారసురాలిని తానే అంటూ శశికళ ప్రకటించిన నేపథ్యంలో.. ఆమెను సాధ్యమైనంత వరకు నిలువరించేందుకు అన్నాడీఎంకే నేతలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా చిన్నమ్మకు తమిళనాడు సీఎం పళని స్వామి వార్నింగ్ ఇచ్చారు. అన్నాడీఎంకేని నాశనం చేయడానికి విష శక్తులు కుట్రలు పన్నుతున్నాయంటూ పరోక్షంగా శశికళపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన వాళ్లు పార్టీని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకసారి పార్టీ నుంచి తొలగించామని, మళ్లీ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని పళని స్వామి స్పష్టం చేశారు. ఎన్నిజిమ్మిక్కులకు పాల్పడినా.. వారి ఆటలు సాగవని వ్యాఖ్యానించారు. టీటీవీ దినకరణ్ వర్గం తలకిందులుగా తపస్సు చేసినా వారు అనుకున్నది ఎన్నటికీ జరగదన్నారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయని సీఎం పళని స్వామి ఉద్ఘాటించారు.
తమిళనాడులో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జైలు నుంచి విడుదలై తమిళనాడుకు వచ్చిన వి.కే శశికళ.. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. అంతేకాదు.. తానే జయలలిత వారసురాలిని అని ప్రకటించుకున్నారు కూడా. అన్నాడీఎంకేలో నలిగిపోతున్న కార్యకర్తలకు తాను అండగా ఉంటానంటూ శశికళ భరోసానిస్తూ ప్రకటించారు. ఈ ప్రకటనపై తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా అన్నాడీఎంకే పెను ప్రకంపనలు సృష్టించాయి.