చిన్నారి కష్టానికి చలించిన మోడీ…


ముంబయిలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల చిన్నారి కష్టానికి ప్రధాని నరేంద్ర మోదీ చలించిపోయారు. చిన్నారి తీరా కామత్ చికిత్సకు అవసరమైన ఔషధాల దిగుమతి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఔషధాల దిగుమతికి సుమారు రూ.6.5 కోట్ల మేర సుంకాన్ని రద్దు చేశారు. దీనివల్ల ఇంజెక్షన్‌ దిగుమతి, పాప చికిత్సకు మార్గం సుగమమైంది.
బాలిక తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫఢణవీస్‌ ఈ నెల 2న ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టింది. స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకొనేందుకు ఎందరో దాతలు విరాళాలు కూడా అందించారు. క్రౌడ్‌ ఫండింగ్ రూపంలో రూ.16కోట్లు మేర తీరా తల్లిదండ్రులు సమీకరించారు.
అయితే, ఈ వ్యాధికి ఔషధాలు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నందున వాటి దిగుమతి ఖర్చులు, జీఎస్టీ, ఎక్సైజ్‌ సుంకం కలిపి అదనంగా మరో రూ.6.5 కోట్లు అవసరమయ్యాయి. దీంతో అంత డబ్బు తమ వద్ద లేదని, దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరుతూ పాప తల్లిదండ్రులు ప్రధానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన మోదీ ప్రభుత్వం చిన్నారి ఔషధాల దిగుమతిపై సుంకాలను రద్దు చేసింది.

About The Author