షర్మిల పార్టీకి టిఆర్ఎస్ శ్రేణుల సహకారం?


షర్మిల పెట్టనున్న కొత్త పార్టీకి ఖమ్మం జిల్లాలో ఆదరణ స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో టి.ఆర్.ఎస్ కు నష్టం జరగవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంతో పాటు అన్ని గిరిజన రిజర్వ్ నియోజకవర్గాలు,అలాగే సత్తుపల్లి నియోజక వర్గంలో ఆమె పార్టీ ప్రభావం చూపవచ్చు. ఆయా నియోజకవవర్గాలలో రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కువ ఉండటం,2014 ఎన్నికలలో ఖమ్మం పార్లిమెంట్ తో పాటు 3 గిరిజన నియోజక వర్గాల్లో వైస్సార్ కాంగ్రెస్ విజయం సాధించడం,సత్తుపల్లి నియోజక వర్గంలో స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.ఇప్పటి కిప్పుడు ఆ పార్టీ లో జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు చేరినా,చేరక పోయినా ఆ పార్టీ క్రమంగా వేళ్లూనుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కాంగ్రెస్ బలహీన పడటం,టి.ఆర్.ఎస్ లో కొనసాగుతూ ఉన్న వర్గ విభేదాలు, ఆ రెండు పార్టీలలోని అసంతృప్తి వాదులు ఇతర పార్టీల వైపు చూస్తుండటం షర్మిల పార్టీకి సానుకూల పరిణామం కావచ్చును. మాజీ ఎం.పి శ్రీనివాస్ రెడ్డి టి.ఆర్.ఎస్ లొనే కొనసాగుతారా?షర్మిల పార్టీకి జై కొడతారా?అన్నది ఇప్పుడు జిల్లా అంతటా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది.షర్మిల పార్టీకి పొంగులేటి పరోక్షంగా సహాయ పడుతున్నట్లు టి.ఆర్.ఎస్ వర్గాలు అనుమానిస్తున్నవి. మొత్తంమీద షర్మిల ఈ నెల 21న ఖమ్మం రానున్నందున ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారినవి.

About The Author