కీచక టీచర్‌కు పదేళ్ల జైలు


విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. ఎక్కువ మార్కులు వేస్తానని, ఫస్ట్‌ ర్యాంకు ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ విద్యార్థినిని వివాహం చేసుకోవడంతో పాటు శారీరకంగానూ దగ్గరయ్యాడు. 2016లో జరిగిన ఈ ఘటనలో విచారణ అనంతరం తాజాగా నిందితునికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
వివరాలు… ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం వెత్తార్లపల్లికి చెందిన మైనర్‌ బాలిక గణపురంలోని ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 2016 వేసవి సెలవుల్లో ఆమె గణపురంలోని మేనత్త ఇంటికి వెళ్లింది. ఏప్రిల్‌ 29న ఇంటినుంచి అదృశ్యమవడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణపురం పోలీసులు విచారణ చేపట్టి ఆమె సెల్‌ ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా సాయిమణిదీప్‌ నంబర్‌ను గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పిన సాయిమణిదీప్‌ 2016 ఏప్రిల్‌ 29న బాలికను తనతో తీసుకువెళ్లాడు.
అనంతరం మే 9న ఖమ్మం జిల్లా ఇల్లెందులోని కోటమైసమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు ఇల్లెందులోని లాడ్జికి తీసుకెళ్లి బాలికను లొంగదీసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆమెను హన్మకొండలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. 2016 మే17న మణిదీప్‌ ఇంటినుంచి బాలికను రక్షించిన పోలీసులు ఆమె వాంగ్మూలం ఆధారంగా మణిదీప్‌తో పాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో ప్రధాన నిందితుడు శివగాని సాయిమణిదీప్‌కు వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.జయకుమార్‌ పదేళ్ల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

About The Author