నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


పెనుకొండ రెవెన్యూ డివిజన్ లో జరిగే ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం

: నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

: జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

: మడకశిరలో మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

అనంతపురం, ఫిబ్రవరి 20 :

జిల్లాలో మొదటి, రెండవ, మూడవ విడతలో కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, అనంతపురం రెవెన్యూ డివిజన్ లలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరిగాయని, నాలుగో విడతలో పెనుకొండ రెవెన్యూ డివిజన్ లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మడకశిర పట్టణంలోని పోలీస్ అమరవీరుల స్మారక పార్క్ లో ఏర్పాటుచేసిన ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికలను ఓటర్ ఫ్రెండ్లీ, అభ్యర్థుల ఫ్రెండ్లీ, పోలింగ్ సిబ్బంది ఫ్రెండ్లీగా నిర్వహిస్తున్నామని, నిర్భయంగా, స్వేచ్ఛ గా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం చేసేందుకోసం కొన్ని క్రియాశీలక చర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా డ్వామా, రెవెన్యూ సిబ్బంది ద్వారా సమాచారం అందించి ఓటు హక్కు ఉన్న వలసకూలీలను రప్పించి వారు ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు చేపట్టామని, నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని, ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది కోసం అన్ని వసతులు కల్పించామని, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద వారి వద్దకే మెటీరియల్ అందజేశామని, ఎన్నికల సిబ్బందికి పారితోషికాన్ని వారి అకౌంట్ల లోకి వేశామన్నారు. మూడు విడతల్లో ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషికాన్ని వారి అకౌంట్ల లోకి ఇప్పటికే వేశామని, నాల్గవ విడత ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బంది కూడా పారితోషికంను అకౌంట్ల లోకి వేసేలా చూస్తామన్నారు.

పెనుకొండ రెవెన్యూ డివిజన్ లో జరిగే ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించామన్నారు. ఎన్నికల కోసం మైక్రో అబ్జర్వర్లు నియామకం చేశామని, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టామని, పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ చేస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికలు దేశానికి పట్టుకొమ్మలని, ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా అన్ని రకాల చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది తో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పోలింగ్ మెటీరియల్ ను అందజేశారా, బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేయడం చెక్ చేసుకున్నారా, మెటీరియల్, భోజనాన్ని మీరు కూర్చున్న చోటకే అందించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల పారితోషకాన్ని మీ అకౌంట్లలోనే వేసేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వారికి తెలియజేశారు. ఇంతకుముందు జరిగిన ఎన్నికల కంటే ఏర్పాట్లు అన్ని బాగా చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆనంద్ కుమార్, ఎంపిడిఓ రాజగోపాల్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

——————————————————–
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురము వారిచే జారీ…

About The Author