వ్యాక్సినేషన్‌ పై కేంద్రం క్లారిటీ…


ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమైంది. ఇందులో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, అలాగే 45 ఏళ్లు దాటిన తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వ్యాక్సిన్‌ కోసం పేర్లు నమోదు చేసుకుంటే టీకాలు వేస్తున్నారు. దీంతో గతంలో కేంద్రం విడుదల చేసిన కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ల కోసం జనం ఎగబడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ యాప్‌ను రిజిస్ట్రేషన్లకు వాడటం లేదని కేంద్రం చావు కబురు చల్లగా చెప్పింది.

రెండో విడత వ్యాక్సినేషన్‌లో కోవిన్ యాప్‌ లేదని కేవలం కోవిన్‌ పోర్టల్‌లోనే కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. కోవిన్ యాప్‌ను కేవలం అడ్మినిస్ట్ర్టేటర్ల కోసం వాడుతున్నట్లు కేంద్రం తెలిపింది.

మిగతా వారంతా కోవిన్‌ డాట్‌ జీవోవీ డాట్‌ ఆర్గ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.

మార్చి 1వ తేదీ నుంచి కోవిన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి వ్యాక్సిన్‌ డోసుల అందుబాటును దృష్టిలో ఉంచుకుని టీకాలు వేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌లో ఒకదానిని ఎంచుకునేందుకు కూడా కరోనా బాధితులకు అవకాశం లేదని, ప్రభుత్వం తమ పరిమితుల మేరకు దీన్ని సరఫరా చేస్తోందని తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలు, ఆస్పత్రుల్లో దీన్ని ఉచితంగా వేస్తారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం రూ.250కే దీన్ని అందుబాటులో ఉంచినట్లు కేంద్రం తెలిపింది.

About The Author