డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించే యోచనలో కేంద్రం!
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. డీజిల్ ధరలు.. సామాన్యుల పాలిట శాపంగా మారిపోగా.. ప్రభుత్వాలపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రయత్నాలను మొదలుపెట్టింది కేంద్రం. గడిచిన 10 నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరలు రెట్టింపు కాగా.. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్టైమ్ హైకి చేరుకోగా.. పన్నులు, సుంకాల రూపంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి.
ప్రజల ఆగ్రహాన్ని తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ఆయిల్ కంపెనీలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ఖజానాలపై పెద్దగా ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రజల్లో కేంద్రం ప్రభుత్వంపై నిరసన వ్యక్తమవుతోండగా.. ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఇంధన ధరలను కంట్రోల్ చేయాలని కోరుతున్నాయి.
ఈ సమయంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడం.. ఎన్నికల్లో రేట్లు పెరుగుదల ప్రభావం చూపిస్తోందేమో? అనే అనుమానంతో ఇంధన ధరలపై కేంద్రం పునరాలోచనలో పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుంటే ఐదు రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్ఠస్థాయికి తగ్గినా, ఆ ప్రయోజనం ప్రజలకు చేరకుండా కేంద్రం రెండుసార్లు భారీగా ఎక్సైజ్ డ్యూటీ పెంచింది.
దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర ఆర్థిక శాఖ ఈ అంశంపై కొన్ని రాష్ట్రాలు, ఆయిల్ కంపెనీలతో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని పలు రాష్ట్రాలు కోరుతుండడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల రెండో వారంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు త్వరలో చమురు ఉత్పత్తి దేశాల భేటీ కూడా జరుగనుంది. చమురు ఉత్పత్తిని పెంచాలని ఆ దేశాలు నిర్ణయిస్తే.. ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని.. అప్పుడు పన్నుల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.