మరణంలోనూ… వీడని స్నేహం
నిజ జీవితంలో మంచి స్నేహితులు.. ప్రమాదంలో కూడా వాళ్ళు ఒకరినొకరు వీడలేము అంటూ కలిసి మృత్యు ఒడిలోకి పయనించారు. కడప నగర శివార్లలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. మృతులను శ్రీకాంత్, షేక్ మస్తాన్‌గా గుర్తించారు. కాగా రాజారెడ్డివీధి సీయోన్‌పురానికి చెందిన తాడిపత్రి శ్రీకాంత్(22) వెంకటరమణ, లక్ష్మీదేవిల కుమారుడు. డీటీహెచ్‌లో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఇంటిలో తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లతో అన్యోన్యంగా ఉండేవాడని, అందిరితో బాగా మాట్లాడేవాడని మేనమామ తెలియజేశారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో స్నేహితుడు మస్తాన్ ఇంటికి వెళ్లిన తర్వాత శ్రీకాంత్ మృత్యువాత పడిన విషయం పోలీసుల ద్వారా తమకు తెలిసిందనీ కుటుంబసభ్యులు ఆవేదన చెందారు.
ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన మరొకరిని మాసాపేటకు చెందిన షేక్ ఖాదర్‌బాషా,హసీనాల పెద్దకుమారుడు షేక్ మస్తాన్ (24)గా గుర్తించారు. వారి బంధువులను పిలిపించారు. మస్తాన్ కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల కిందట ఆయేషాను వివాహం చేసుకున్నాడు. మస్తాన్ ఇంటి వద్దకు శ్రీకాంత్ రావడంతో, వీరిద్దరు కలిసి సాయంత్రం ద్విచక్రవాహనంలో సిద్దవటానికి వెళ్లారు. అక్కడ తాను పనిచేసినందుకు కూలీడబ్బులు తీసుకుని రావడానికి స్నేహితుడు శ్రీకాంత్‌ను వెంటపెట్టుకుని వెళ్లాడు. తిరిగి కడపకు వస్తుండగా….రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామాంజనేయపురం ఏటీఎం దగ్గరకు రాగానే లారీ వెనుక వైపు నుంచి ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలు ఛిద్రమైపోయాయి. మృతదేహాలకు రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం బంధువులకు అప్పగించారు. రిమ్స్ సీఐ పి. సత్యబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.