కిలాడీ కపుల్‌‌.. డబ్బులకు ఎక్కువ వడ్డీ ఇస్తామని..


వ్యాపారంలో పెట్టుబడి కోసం డబ్బు కావాలంటూ నమ్మించి మోసం చేసిన దంపతులపై బంజారాహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని శ్రీరాంనగర్‌కు చెందిన అశ్వని ముకుందం, భాగ్యలక్ష్మి దంపతులు తెలిసిన వారి వద్ద నుంచి వ్యాపారం కోసం పెట్టుబడులు కావాలని భారీగా వడ్డీతో ఆరు నెలల్లో డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఈసీఐఎల్, నాగారం సమీపంలోని శ్రీలక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన ఎస్‌.పావని వద్ద నుంచి 2019లో రూ.15లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆరు నెలల్లో వడ్డీతో కలిపి డబ్బులు తిరిగి ఇస్తామంటూ నమ్మించిన దంపతులు ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ మధ్య వారి గురించి ఆరా తీయగా చాలా మంది వద్ద నుంచి ఇదే విధంగా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తేలింది. దీంతో తాము మోసపోయామని గుర్తించి ఆదివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author