క‌రోనా ప‌రిస్థితుల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌…


తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. క‌రోనా ప‌రిస్థితులు, నియంత్ర‌ణ చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌తో పాటు వీకెండ్ లాక్‌డౌన్‌పై వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్‌, వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వీ, హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేశ్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ మ‌ధ్యాహ్నం ప్ర‌గ‌తి భ‌వ‌న్ చేరుకున్న విష‌యం తెలిసిందే. ఏప్రిల్‌ 19న సీఎం కేసీఆర్‌ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలుండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టు ఆయ‌న వ్య‌క్తిగ‌త వైద్యుడు ఎంవీ రావు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో 20 రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు.

ముఖ్యమంత్రికి ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌తోపాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నట్టు తేలింది. దీంతో సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్నట్టు వైద్యులు నిర్ధారించారు.

#TelanganaFightsCorona

About The Author