కేరళను మెచ్చుకున్నా మోడీ…


దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ అందరికీ ఉన్న ఒకే ఒక ఆశ వాక్సిన్… అయితే మొదట్లో వాక్సిన్ పట్ల అంతగా ఉత్సాహం చూపని ప్రజలు, సెకండ్ వేవ్ ముంచుకొచ్చేసరికి వాక్సిన్ సెంటర్ల దగ్గర క్యూలు కడుతున్నారు. దేశీయంగా తయారు అవుతున్న వాక్సిన్ డోసులు నెలకు ఏడు కోట్ల లోపలే… ఫలితంగా విపరీతమైన డిమాండ్ నెలకొంది… ఈ పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం కరోనా వ్యాక్సీన్ ను వృథా కాకుండా అమలు చేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది… కేరళలో వాక్సినేషన్ ప్రక్రియ అమలు అవుతున్న విధానాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. అక్కడి ఆరోగ్య కార్యకర్తల పనితీరును మెచ్చుకున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 10 శాతం వరకు వ్యాక్సీన్ వృథాకు మినహాయింపు ఇచ్చింది. తమిళనాడులాంటి రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వృథా రేటు 8.83 శాతం ఉండగా, లక్షద్వీప్‌లో రికార్డు స్థాయిలో 9.76 శాతం ఉంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది. కానీ, కేరళలో పరిస్థితి వీటన్నిటి కంటే భిన్నంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కేరళకు 73,38,806 వ్యాక్సిన్ మోతాదులు అందాయి. అందులో 74,26,164 డోసులను ప్రజలకు ఇచ్చారు. అంటే అదనంగా 87,358 మందికి వ్యాక్సీన్ వేశారు. వ్యాక్సీన్ ఏమాత్రం వ్యర్థం కాకుండా అందరికీ డోసులు వేశారు.ఈ విషయాన్ని పినరయి విజయన్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ, వ్యాక్సీన్ సీసాలలో అదనంగా ఉన్న డోసును కూడా వృథా చేయకుండా సమర్థంగా ప్రజలకు వ్యాక్సీన్ అందించినందుకు కేరళ ఆరోగ్య కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.దాన్ని ప్రధాని మోదీ రీట్వీట్ చేస్తూ, కేరళ ఆరోగ్య కార్యకర్తలను ప్రశంసించారు. కోవిడ్ 19ను ఎదుర్కోవాలంటే వ్యాక్సీన్ డోసుల వృథాను తగ్గించాలని పేర్కొన్నారు మోదీ. వ్యాక్సినేషంలో భాగంగా కేరళ ఒక సమర్థ ప్రణాళికను అవలంబించింది.ఐదు మిల్లీ లీటర్ల వ్యాక్సీన్ సీసాలో 10 డోసులు ఉంటాయి. అంటే ఒక సీసా తెరిస్తే పదిమందికి టీకాలు వేయవచ్చు. వ్యాక్సీన్ తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో వ్యాక్సీన్ తయారీదారి సంస్థలు ప్రతీ సీసాలోనూ కొన్ని అదనపు టీకా చుక్కలను సరఫరా చేస్తున్నాయి.అంటే ప్రతీ సీసాలోను 0.55 మి.లీ లేదా 0.6 మి.లీల ఔషధం అదనంగా ఉంటోంది. మా దగ్గర బాగా శిక్షణ పొందిన నర్సులు ఉన్నారు. ఒక్క టీకా చుక్క కూడా వృథా కాకుండా సీసా తెరిచిన తరువాత పదిమందికి బదులు 11 లేదా 12 మందికి వ్యాక్సీన్ వేస్తున్నారు అని కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు అనీష్ తెలిపారు. ఈ నిపుణుల బృందం కేరళ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తోంది. డాక్టర్ అనీష్ తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఒక వ్యాక్సీన్ సీసా మూత తెరిచిన నాలుగు గంటల లోపలే 10 లేదా 12 మందికి టీకా వేసేయాలి. లేదంటే అది పాడవుతుంది. ఏరోజైనా వ్యాక్సీన్స్ సెంటర్‌లో 10 కన్నా తక్కువమంది ఉంటే, వ్యాక్సినేషన్ మరుసటి రోజుకు వాయిదా వేస్తారు అని డాక్టర్ అనీష్ తెలిపారు. ఇదే కాకుండా, కేరళలో ఆస్పత్రులన్నిటికీ ఒక పద్ధతి ప్రకారం వ్యాక్సీన్ పంపిణీ చేస్తున్నారు. ఏ ఆస్పత్రికీ కూడా 200 సీసాలకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. వాటిని కూడా మొదటి, రెండవ డోసుల మధ్య విభజిస్తున్నారు. 120 వ్యాక్సీన్ సీసాలను మొదటి డోసులకు ఉపయోగిస్తారు. మిగతా వాటిని రెండో డోసు ఇవ్వడానికి వినియోగిస్తారు అని కేరళ ఆరోగ్య సేవల మాజీ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.వ్యాక్సీన్ వృథా కాకుండా ప్రజలకు నిర్ణీత సమయాన్ని కేటాయిస్తున్నారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఏరోజైనా తగినంతమంది రాకపోతే, మర్నాటికి వాయిదా వేస్తున్నారని, మర్నాడు వచ్చి టీకా వేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారని అధికారులు తెలిపారు.కోవిషీల్డ్ సీసాల్లో కొంత అదనపు టీకా చుక్కలు ఉంటాయిగానీ కోవాగ్జిన్‌లో సరిగ్గా 5 మి.లీ మాత్రమే ఉంటుంది. ఎంత వ్యాక్సీన్ వృథా అవుతుంది అనేది రాష్ట్రాలకు ఎంత వ్యాక్సీన్ అందుతోంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. కేరళకు 90 శాతం కోవిషీల్డ్, 10 శాతం కోవాగ్జిన్ అందుతోంది అని డాక్టర్ అనీష్ వివరించారు.

About The Author