మూతపడిన ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి…
• రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
• దాతల కోసం సెల్ ఏర్పాటు
• ఆక్సిజన్ ఆదాకు ప్రత్యేక దృష్టి
• 15 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కొనుగోలు : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
అమరావతి, మే 12 : రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి, ఆక్సిజన్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దేశ, విదేశాల నుంచి కష్టకాలంలో రాష్ట్రప్రజలను ఆదుకోడానికి దాతలు ముందుకొస్తున్నారని, వారి కోసం సెల్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృథాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 90,750 కరోనా టెస్టులు చేయగా, 21,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 89 మంది మృతి చెందారని తెలిపారు. 633 ఆసుపత్రుల్లో 6,629 ఐసీయు బెడ్లు ఉండగా, 6,221 రోగులతో నిండిపోయాయన్నారు. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో అన్ని ఫుల్ అయ్యాయన్నారు. కర్నూల్ 264 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్లు 23,184 ఉండగా, 22,548 బెడ్లు రోగులతో నిండి పోయాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 49,344 బెడ్లు ఉండగా, 15,610 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 21 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ప్రైవేటు ఆసుపత్రులకు 14,095 డోసులు సప్లయ్ చేశామన్నారు. కేంద్రం నుంచి గడిచిన 24 గంటల్లో 590 టన్నుల ఆక్సిజన్ రాగా, అంతా వినియోగించుకున్నామన్నారు. 78 ట్యాంకర్లతో రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సప్లయ్ చేస్తున్నామన్నారు.
పెరుగుతున్న ఆక్సిజన్ రవాణా కెపాసిటీ…
పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ రవాణా కెపాసిటీని 350 టన్నుల నుంచి 590 టన్నులకు పెంచుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ ను సకాలంలో ఆసుపత్రులకు పంపించాలనే లక్ష్యంతో చిన్న చిన్న ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నామన్నారు. దీనివల్ల ఎంతో సమయం కలిసొస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేస్తున్న 25 క్రయోజనిక్ ట్యాంకర్లు వస్తే రవాణా కెపాసిటీ మరింత పెరుగుతుందన్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామన్నారు. తిరుపతి పద్మావతి, రుయా, కడప, విజయనగరం ఆసుపత్రుల్లో స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించగా, ఇప్పటికే ఒక ట్యాంకర్ వచ్చిందన్నారు. 20 టన్నుల కెపాసిటీ కలిగిన మరో రెండు ట్యాంకర్లను పశ్చిమ బెంగాల్ నుంచి రానున్నాయన్నారు. ఖాళీగా కాకుండా ఆక్సిజన్ తో పంపాలని కోరాగా, అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆ రెండు ట్యాంకర్లలో 40 టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందన్నారు.
మూతపడిన ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి…
రాష్ట్రంలో వివిధ పరిశ్రమలకు చెందిన ఆక్సిజన్ సిలిండర్లు 17 వేలుగా ఉండగా, 14,338 సిలిండర్లను గుర్తించామన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆ సిలిండర్లను కరోనా వైద్య సేవలకు మరల్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 6,917 సిలిండర్లు వైద్యానికి మార్చామన్నారు. ఆక్సిజన్ కొరత నివారణకు అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి, వాటిలో ఉత్పత్తికి ఆయా ప్లాంట్ల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. అనంతపురం 2 ప్లాంటులు, గుంటూరు, కడప, విశాఖపట్నంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి వాటి సామర్థ్యం మేరకు 37 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన మరిన్ని ప్లాంట్లను గుర్తించి, ఆక్సిజన్ ఉత్పత్తికి పరిశ్రమల శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నైట్రోజన్ ప్లాంట్లను గుర్తించామని, వాటి ద్వారా ఆరు టన్నుల ఆక్సిజన్ ను ఈ నెలాఖరులోగా సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఏపీ పేపర్ మిల్స్ వంటి పెద్ద ప్లాంట్లును కూడా గుర్తించామని, వాటితో పరిశ్రమల శాఖాధికారులు మాట్లాడుతున్నారన్నారు. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ అందుబాటులోకి వస్తే మరింత లబ్ధి కలుగుతుందన్నారు.
ఆక్సిజన్ వృథాపై ప్రత్యేక దృష్టి…
రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృథాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దీనిలో భాగంగా నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ వినియోగంపై నిపుణులు పర్యవేక్షించారన్నారు. వారు 30 శాతం ఆక్సిజన్ వృథాను అరికట్టారన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆదా చేస్తే 70 టన్నులు ఆదా అవుతుందని, దీనివల్ల ఎందరో పేషంట్లకు మేలు కలుగుతుందని అన్నారు. ఆక్సిజన్ వృథాను అడ్డుకోడానికి వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, టెక్నికల్ టీమ్స్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వానా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
గడచిన 24 గంటల్లో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 3,496 వైద్యులు హోం ఐసోలేషన్ ఉన్న 14,019 కరోనా బాధితులకు ఫోన్ చేశారన్నారు. 770 మందికి కొవిడ్ కేర్ సెంటర్ కు సిఫార్సు చేశారన్నారు. 104 కాల్ సెంటర్ కు 14,095 కాల్స్ వచ్చాయన్నారు.
దాతల కోసం సెల్ ఏర్పాటు…
దేశ, విదేశాల నుంచి కష్టకాలంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. పీఎస్ఏ ప్లాంట్లు పెడతామని, మందులు పంపిణీ చేస్తామని, కిట్లు అందజేస్తామని, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇస్తామని దాతలు ముందుకొస్తున్నారన్నారు. ఈ దాతలతో సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతో సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సీనియర్ అధికారి అర్జా శ్రీకాంత్ ను ఇన్ఛార్జిగా నియమించామని తెలిపారు.
15 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కొనుగోలు…
15 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేయాలని గతంలో నిర్ణయించామన్నారు. ఈ నెలాఖరులోగా 8 వేల 5 లీటర్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు రాష్ట్రానికి వస్తాయని భావిస్తున్నామన్నారు. 10 వేల 10 లీటర్ల కాన్సంట్రేటర్లు కొనుగోలు చేయాలని కొనుగోలు కమిటీలో నిర్ణయించామన్నారు. రెండు మూడు వారాల్లో రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల కొవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ సరఫరాకు అవకాశం కలుగుతుందన్నారు.
కరోనా కేసులు, మృతుల సంఖ్యను దాచి పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల నుంచి వచ్చే వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందజేస్తున్నామన్నారు. అంకెలు దాచడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఎటువంటి లాభం ఉండదన్నారు. జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులతో నిర్వహించే సమావేశాల్లో అన్ని వివరాలు చెప్పడం వల్ల వాస్తవ పరిస్థితి అందరికీ తెలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
గమనిక : ఫొటోలు ఉన్నాయి…
జారీచేసిన వారు : పబ్లిసిటీ సెల్, I&PR, సచివాలయం, అమరావతి.