కోవాగ్జిన్ ఫార్ములా బదిలీకి ఓకే…
కోవాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్ బయోటెక్ అంగీకరించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడి రాష్ట్రాల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో కోవిడ్ 19 టీకాల లభ్యతను గణనీయంగా పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది.అందుకు వీలుగా ‘న్యూ లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్ట్రాటెజీ’ని రూపొందించినట్లు స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సాంకేతిక బదిలీకి సంబంధించి ద్వైపాక్షిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఫార్మా సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది.
అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ‘ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్), భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీఒఎల్), అలాగే, ముంబైకి చెందిన హాఫ్‌కిన్స్ బయోఫార్మా.. ‘కోవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థతో టీకా సాంకేతికత బదిలీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఒప్పందాల వెనుక భారత ప్రభుత్వ కృషి ఉందని తెలిపింది. మరోవైపు, ఈ మూడు సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోందని వెల్లడించింది. ఐఐఎల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి, బీఐబీసీఓఎల్, హాఫ్‌కిన్స్ ఈ సంవత్సరం నవంబర్ నుంచి కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని తెలిపింది. ఈ మూడు సంస్థలే కాకుండా, మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీ జరిగి, పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి సాధ్యమయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది.
ఈ దిశగా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోందని పేర్కొంది. కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీకి, లైసెన్సుల జారీకి సంబంధించి జాప్యం జరుగుతోందన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సంబంధిత వార్తా కథనాలు, ట్వీట్లు అవాస్తవాలని స్పష్టం చేసింది. టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఇతర ఫార్మా కంపెనీలకు కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి వీలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
నేరుగా దిగుమతికీ వెసులుబాటు
విదేశాల్లో రూపొందిన, విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ 19 టీకాలను భారత్‌లో వినియోగించేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రారంభించామని తెలిపింది. అమెరికా, యూరోప్, జపాన్ తదితర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన.. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చిన వ్యాక్సిన్లను భారత్‌లో వెంటనే వినియోగించేందుకు వీలుగా నూతన పాలసీని రూపొందించామని తెలిపింది.
తక్షణమే వినియోగించుకునే వీలున్న విదేశీ టీకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారానే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా సమకూర్చుకునే వీలు కూడా కల్పించామని పేర్కొంది. విదేశీ ఉత్పత్తిదారులకు భారత్‌లో ప్రవేశించేందుకు ఆసక్తి కలిగేలా ధరల విధానంలోనూ ఈ కొత్త పాలసీలో మార్పులు చేశామని వెల్లడించింది. మరోవైపు, మోడెర్నా, ఫైజర్ తదితర విదేశీ టీకా ఉత్పత్తిదారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని వెల్లడించింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని దరఖాస్తు చేసుకోవాలని వారిని కోరుతోందని తెలిపింది. మరోవైపు, కోవిడ్ టీకాలకు మేథో హక్కుల మినహాయింపు కోసం భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపింది.
3ఫార్మా కంపెనీలకూ ఆహ్వానం
కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయాలనుకునే ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. తద్వారా టీకాల ఉత్పత్తి పెరిగి, దేశీయంగా వాటి లభ్యత మెరుగుపడుతుందన్నారు. భారత బయోటెక్‌తో అవి ఒప్పందం కుదుర్చుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఇతర ఫార్మా కంపెనీలతో సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందన్నారు. ‘ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ప్రతినిధులతో చర్చించాం. వారు సంతోషంగా స్వాగతించారు’ అని పాల్ తెలిపారు. ‘‘అయితే, ఈ వ్యాక్సిన్‌ను లైవ్ వైరస్‌ను ఇనాక్టివ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ‘బీఎస్‌ఎల్3’ ల్యాబొరేటరీల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మా కంపెనీల్లో ఇవి లేవు’’ అని వివరించారు.