భోగ భాగ్యలిచ్చే ‘భోగి’..!
భోగ భాగ్యలిచ్చే ‘భోగి’..!
తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు ‘భోగి’తో ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో, హేమంత రుతువులో, శీతగాలులు వీస్తూ.. మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి. సంక్రాంతిపండుగ ముందు రోజును భోగి అంటారు.
‘భోగి’ రోజున కొన్ని రకాల కూరగాయలు, పాలు పోసి పులగాలు (పొంగలి) వండుతారు. ఈ భోగి రోజే గొచ్చి గౌరీవ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరకు గడల లాంటివి వాడుతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళ హారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు.
ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. నాలుగో రోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను 4 వ రోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. ఆ తర్వాత గొచ్చి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. భోగి రోజు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది 4 రోజులు, మరికొంతమంది 6 రోజులు చేయడం కూడా ఆచారం. ‘భోగి’ రోజు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం లాంటి వాటితో, పేరంటాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతికోసం ఈ పండుగ జరుపుతుంటారు.
‘భోగి’ మంటలు
దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు – భోగిమంటలు. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు.
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామునే లేచి భోగిమంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో హుషారుగా ఉంటారు.
“భగ” అనే పదం నుండి “భోగి” అన్నమాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు – భోగిమంటలు.
కుప్పలు నూర్పిడి అవగానే మిగిలిన పదార్ధాలను మంటగా వేయటం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెము వేడెక్కుతుంది.
దీనిని సంవత్సరంలో ఆ కాలంలో చలిని ప్రాలదోలడమే కాకుండా, ఇంకో సందర్భముగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు , విరిగిపోయిన బల్లలు వగైరా మొత్తం పోగు చేసి వీటితో బోగి మంటను వెలిగిస్తారు. దీని ద్వారా కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజు ‘భోగి’ మంటలు వెలిగిస్తారు.
కొందరి ఇళ్లలో ‘భోగి’ రోజు సాయంత్రం పూట చిన్న పిల్లల బొమ్మలు కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మలు కొలువులో పిల్లల వివిధ రకాల ఆట వస్తువులని ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. మరికొంత మంది భోగి పళ్ళ పేరంటం చేస్తారు. ఇక్కడ పేరంటాళు మరియు బంధువులు సమావేశమై , రేగి పళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టు బట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.
మకర సంక్రాంతి
జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడం వరకూ సంక్రాంతిపండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకూ దక్షిణాయనంలో సంచరిస్తూ వస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన శుభదినం కూడా ఇది.
సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష బ్రహ్మ. కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయనంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకరసంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. భోగి తర్వాత రోజు వచ్చేదే సంక్రాంతి.
సంక్రాంతి రోజునే శ్రీ మహా విష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్తాపన జరిగి అధర్మమును రూపుమాపిన రోజు సంక్రాంతి.
మకర సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు సంక్రాంతి పర్వదినాన నిర్వర్తించాలి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరాకి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.
మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం. ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.
కనుము విశిష్టత
సంక్రాంతి పండుగల్లో చివరి రోజు కనుము. కనుము కర్షకుల పండుగ. పాడి పంటలను, పశు సంపదను, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు. ప్రకృతి స్వరూపిణీ అయిన అమ్మ ఆరాధన విశేషమే ఈ రోజు. తెలంగాణ ప్రాంతంలో ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వాంచి, పసుపు, కుంకుమలు, నువ్వుల పిండి మొదలైనవి ఇచ్చి ‘సువాసి’ పూజలు చేస్తారు. ఏడాదంతా పాడిపంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడాకి ‘కనుము’ పండుగను జరుపుకుంటారు. మనది వ్యవసాయిక దేశం కనుక మనుష్యులకే కాదు, పశు పక్ష్యాదులకు ఇది పండుగే.
మనకు ఎంతో ఆనందాన్ని, సకల సౌభాగ్యాలను, శుభములనిచ్చే సంక్రాంతి పండుగలను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం, తరిద్దాం.