అమ్మాయిలు మందుకొట్టి బడికొచ్చారు…
అమ్మాయిలు మందుకొట్టి బడికొచ్చారు…
టీచర్ పాఠం చెబుతున్నా మందేస్తున్నారు.. విజయవాడలో ఇదో దారుణం.. టీసీ ఇచ్చి ఇంటికి పంపారు…
ఇద్దరు విద్యార్థినులు తరగతి గదిలో తూలుతూ తోటి మీద పడుతుండటం, నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటంతో తోటి విద్యార్థినులు ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. వాళ్లను పరీక్షిస్తే విస్తుపోయే విషయం తెలిసింది. వారు మద్యం తాగి తరగతులకు వస్తున్నట్లు తెలియడంతో ఉపాధ్యాయులంతా ముక్కున వేలేసుకున్న ఈ ఘటన.. రాజధాని నగరం విజయవాడ శివారు ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజులుగా శీతలపానీయంలో మద్యం కలిపిన సీసాలతో పాఠశాలకు వస్తున్నారు. చున్నీ చాటున ఎవరికీ కనపడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో తాగారు. పక్కన కూర్చున్న తోటి విద్యార్థినులపై తూలడం మొదలుపెట్టారు. వారి నుంచి మద్యం తాగిన వాసన వస్తుండటంతో ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు వైద్య నిపుణులతో మద్యం పరీక్ష చేయించారు. బాలికలు మద్యం తాగినట్లు తేలడంతో ఖంగుతిన్నారు. తల్లిదండ్రులను పిలిపించి, విద్యార్థులతోపాటు వారికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా.. ‘విద్యార్థినులు మద్యం తాగి తరగతికి రావడం వాస్తవమే. వీరిద్దరూ గతంలో చదువుకున్న పాఠశాలలోనూ ఇదే పని చేయడంతో టీసీలు ఇచ్చినట్లు తెలిసింది. తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో.. సీసాలో మిగిలిన దాన్ని తాగడం కారణంగా బాలికలకు అలవాటు అయిఉంటుందని భావిస్తున్నా. తోటి విద్యార్థులు పాడైపోతారని కుటుంబసభ్యుల సమక్షంలోనే వారికి టీసీలు ఇచ్చా’ అని వివరించారు.