వ్యాధులని నయం చేసే నంజున్ దేశ్వరుడు…
వ్యాధులని నయం చేసే నంజున్ దేశ్వరుడు
ఈ ఆలయంలోని శివునికి పూజలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులే కాదు మొండి రోగాలు కూడా మాయమవుతాయట. ఈ పుణ్య క్షేత్రాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు. ఇది కర్ణాటక రాష్ట్రo లోని మైసూరు కి దగ్గ్గరలో ఉన్న నంజున్ గడ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని శ్రీ కంఠ ఈశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడి శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠ చేసారని ఆలయ శిలాఫలకాలు చెప్తున్నాయి.
నంజ అంటే విషం,నంజుంద అంటే విషం తాగి లోకాన్ని రక్షించివాడు అని అర్ధం వస్తుంది. సముద్రమథన సమయంలో వచ్చిన విషాన్ని సేవించిన శివుడు లోకాన్ని మొత్తం రక్షించి నీలకంటుడిగా పూజలందుకున్నాడు. ఆ అవతారమే ఇక్కడ ప్రతిష్ఠ గావించబడింది. ఆలయం దగ్గరలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి ఉరుల్ అనే సేవ చేసుకుంటే ఎలాంటి వ్యాధి అయినా క్రమంగా తగ్గుముఖం పడుతుందిట. పూర్వం కర్నాటకని పాలించిన టిప్పుసుల్తాన్ ఏనుగుకి కళ్ళ సంబందిత వ్యాధి వచ్చి ఎంతకీ తగ్గకపోతే ఇక్కడ నంజున్ దేశ్వరుడికి పోజలు చేయిస్తే వెంటనే తగ్గిందట. ఆ ఆనందానికి నిదర్శనంగా టిప్పు స్వామి వారికి పచ్చల పతకం, పచ్చల కిరీటం చేయించాడట.
ఈ శ్రీకంటేశ్వర ఆలయంలో ప్రతి ఏడాది రెండు సార్లు రథోత్సవం నిర్వహిస్తారట. ఒకటి దొడ్డ రథోత్సవం రెండవది చిక్క రథోత్సవం . ఈ రథోత్సవం మూడు రోజులు జరుగుతుంది. అయిదు రథాలతొ జరిగే ఈ ఉత్సవం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ రథాలలో శివుడిని,.పార్వతి దేవిని,గణపతిని,కుమారస్వామిని,చండికేశ్వరుడిని తిరువీధులలో ఊరేగిస్తారు. మూడు రోజులు జరిగే ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాలని లాగి తమ భక్తిని చాటుకుంటారు.
ఇక్కడికి దగ్గరలోనే పరశురామ క్షేత్రం ఉంది. పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుక శిరస్సుని ఖండించి ఆ వ్యథతో తనకు చిత్తశాంతి కలగటానికి ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించాడట,కాని ఎక్కడా లభించని మనశ్శాంతి ఇక్కడికి వచ్చేసరికి లభించటం తో ఇక్కడే ఉండిపోయి తపస్సు చేసుకున్నాడట. శ్రీ కంఠ ఈశ్వరుడిని దర్శించుకునే వారు ముందుగా ఈ పరశురామ క్షేత్రాన్ని దర్శించాలిట.
ఈ ప్రాంతంలోని మరో విశేషం కపిల నదిపై కట్టిన వంతెన. ఇది దేశంలోనే అతి పురాతన బ్రిడ్జ్ గా పేరుపొందిదట. 1735 లో కట్టిన ఈ వంతెన ఇప్పటికి చెక్కు చెదరలేదు. అలాగే ఇక్కడి అరటిపండుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది తెలుసా. నంజన్ గుడ్ రసభాలే అనే జాతిక్ చెందిన ఈ అరటి ఎంతో రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట.
ఇన్ని విశేషాలతో ప్రఖ్యాతి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని చూసి తరించక తప్పదు కదా!