కోడి రామకృష్ణ కన్నుమూత…

టాలీవుడ్‌కు కోలుకోని నష్టం జరిగింది. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. శ్వాసకోశ వ్యాధితోపాడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన తీవ్ర అస్వస్థకు గురై గు గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత నెమ్మదించినా మళ్లీ వ్యాధి తిరగబెట్టింది. ఆయన కొన్నాళ్ల కింద పక్షవాతంతోనూ బాధపడ్డారు.

కథ, కథనంలో తనదైన ముద్ర వేసిన కోడి రామకృష్ణ ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలు తీశారు. ‘ముద్దుల మావయ్య’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘మువ్వగోపాలుడు‘, ‘అంకుశం’,‘ఆహుతి’, ‘అమ్మోరు..’, ‘అరుంధతి’ వంటి హిట్ చిత్రాలు ఆయన దర్శకత్వంలో రూపొందినవే. 2016లో వచ్చిన కన్నడ చిత్రం ‘నాగహారవు’ ఆయన చివరి సినిమా. ఆయన తీసిన చాలా సినిమాల్లో మధ్యతరగతి జీవితాలకు, కాస్తా సరసం, మసాల జోడించి జనరంజకంగా తీర్చిదిద్దడం కనిపిస్తుంది. శతాధిక చిత్రాల దర్శకుడైన రామకృష్ణ సినీపరిశ్రమకు పెద్దదిక్కుగానూ ఉండేవారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన రామకృష్ణ.. దాసరి నారాయణరావు వద్ద శిష్యరికం చేశారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి దాదాపు అందరు అగ్రహీరోలతో, మాధవి, విజయశాంతి, భానుప్రియ వంటి తారలతో ఆయన సినిమాలు తీశారు.

About The Author