ఉగాది యుగాది మనకు తొలిపండుగ : టిటిడి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
మహతిలో ఘనంగా ఉగాది సంబరాలు
ఉగాది యుగాది మనకు తొలిపండుగ అని టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జెఈవో శ్రీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ శ్రీవికారినామ సంవత్సరంలో భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. వికారినామ సంవత్సరం 1959లో వచ్చిందని ఆ తర్వాత ఈ ఏడాది వచ్చిందని, 2079లో వస్తుందన్నారు. మనో వికారాన్ని పోగొట్టి, మనో వికాసాన్ని సమకూర్చుతుందన్నారు. ఉగాది రోజున ఉగాది పచ్చడిని తినడంతో పాటుగా పంచాంగ శ్రవణం చేసి రాశిఫలాల ద్వారా భవిష్యత్తులో జరిగే మంచి చెడులను తెలుసుకుని తదనుగుణంగా ఆచరించడం ప్రధానమైన అంశమని అన్నారు. ఉగాది పండుగ ఇతర పండుగలు, వ్రతాలవలే ఏదో ఒక దేవతను ఉద్దేశించి చేసేది కాదని అన్నారు. అనంతమైన కాలాన్ని మన ఇష్ట దైవ స్వరూపంగా భావించి, సంవత్సరకాల భవిష్యత్తును ముందుగా తెలుసుకుని ఆయా సమయాల్లో దైవాను గ్రహప్రాప్తి కోసం చేయాల్సిన సాధనాలను సిద్ధ పరచుకుని ఒక చక్కని శాస్త్రీయ ప్రణాళికను తయారు చేసుకోవడమన్నారు. ప్రతి ఒక్కరూ శ్లోకాలను నేర్చుకుని మన సంప్రదాయాలను, సంస్కృతిని అలవరచుకోవాలన్నారు. ప్రతి పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలన్నారు.
ఈ సందర్భంగా పురాణ పండితులు శ్రీ జి. బాలసుబ్రహ్మణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో జెఈవో సన్మానించారు.
ఆ తరువాత హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా. రమణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీఆముదాల మురళి అష్టావధానం నిర్వహించారు. ఇందులో నిషిద్ధాక్షరి కట్టా నరసింహులు, నెస్తాక్షరి డా. జి. చలపతి, సమస్య డా|| జి. చెన్నకేశవులు, వర్ణన డా.తేజోవాణి, ఆశువు డా|| సుహసిని, పురాణ పఠనం డా|| వై.పరమేశ్వరయ్య, అప్రస్తుత ప్రసంగం డా. ఇ.జి.హేమంత్‌కుమార్ చేశారు. అనంతరం అవధానిని, ఇతర సభ్యులను డిపిపి కార్యదర్శి డా. రమణప్రసాద్, ధార్మిక విజ్ఞాన పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య దామోదర్‌నాయుడు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.
ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చక్కగా మంగళధ్వని వినిపించారు. ఆ తరువాత ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు.
అనంతరం తితిదే ఉద్యోగుల పిల్లలతో సాంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత ఉగాది సందర్భంగా తితిదే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, పద్యపఠనం, స్వేయ కవిత పోటీలు, పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ఇతర అధికార ప్రముఖులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు