భద్రాచలం మాదే… మేమే అభివృద్ధి చేస్తాం : చంద్రబాబు సంచలన ప్రకటన…
కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.
భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో భాగం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. ఇప్పుడు భద్రాచలం కూడా తమదేనని ఏపీ సీఎం చంద్రబాబు తాను ఎక్కడెక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే, అక్కడ ప్రకటిస్తున్నారు. తద్వారా త్వరలోనే భద్రాచలాన్ని కూడా ఏపీలో కలిపేసుకుంటారా అన్న అనుమానాలు కలగడం సహజం. నందిగామలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మరోసారి ఇదే మాట అన్నారు. భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌దే అన్నారు. తామే అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రతిసారీ చంద్రబాబు ఇదే కామెంట్ చెయ్యడానికి ప్రధాన కారణంగా పోలవరం ప్రాజెక్టు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తైతే… ముంపు ప్రాంతాల్లో భద్రాచలం కూడా చేరుతుందనీ, ఇందుకు సంబంధించి ఎలాంటి రక్షణా లేనందువల్ల ఈ ప్రాజెక్టును నిర్మిస్తే భద్రాచలానికి ప్రమాదం అని టీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పోలవరం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో ఎవరూ అడ్డుకోకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం కడితే, తెలంగాణకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నిస్తున్న చంద్రబాబు… కావాలంటే భద్రాచలాన్ని కూడా తామే తీసుకొని అభివృద్ధి చేసుకుంటామనీ, తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.