దేశాన్ని రెండుగా చీలనివ్వను : మోదీ
నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు దేశాన్ రెండుగా చీల్చడానికి చూస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లో తాను అలా జరగనివ్వనని తేల్చిచెప్పారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్లా, ముఫ్తీల కుటుంబాలు మూడు తరాల జమ్మూకశ్మీర్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయని మండిపడ్డారు. వారిని సాగనంపితేనే జమ్మూకశ్మీర్‌కు చక్కటి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
ఆ ఇరు పార్టీల వాళ్లు తనపై విమర్శలు మాత్రమే చేయగలరని, దేశాన్ని విడదీయలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాల కారణంగా కాశ్మీరీ పండిట్లు తమ జన్మభూమిని వదిలివేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలతో పండిట్లపై జరుగుతున్న దాడులపై నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. కాశ్మీరీ పండిట్లను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు.