ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం నమోదైంది… కోడెల శివప్రసాద్ రావుపై కేసు…
రాష్ట్రంలో సంచలనం నమోదైంది. స్పీకర్ గా ఐదేళ్ళు పనిచేసిన కోడెల శివప్రసాద్ రావుపై గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదుచేశారు. ఉదయం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిసి కోడెల అంశంతో పాటు అనేక అంశాలపై ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది.
పోలింగ్ రోజున కోడెల రాజుపాలెం మండలంలోని ఇనుమెట్ల గ్రామపంచాయితీ పోలింగ్ కేంద్రంలో నానా రచ్చ చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి దాదాపు గంటపాలు తలుపులు మూసేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు. తర్వాత బయటకు వచ్చిన కోడెల చొక్కా చిరిగిపోయుండంటం అందరూ చూసిందే. పోలింగ్ బూతులో వైసిపి ఏజెంట్లు తనపై దాడి చేసి కొట్టారని, చొక్కాను చింపేశారని కోడెల ఆరోపించారు.
అయితే కోడెలే తన చొక్కాను తానే చింపేసుకుని తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ వైసిపి నేతలు ఎదురుదాడి చేశారు. అయితే వైసిపి నేతల ఆరోపణలను పట్టించుకోని పోలీసులు కోడెల ఆరోపణలపైనే వైసిపి నేతలపై కేసులు పెట్టారు. జిల్లాలోని వైసిపి నేతలు ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.
ఇటువంటి నేపధ్యంలోనే జగన్ ఉదయం గవర్నర్ ను కలిశారు. అనేక అంశాల్లో కోడెల వ్యవహారంపైన కూడా ఫిర్యాదు చేశారు. ఉదయం జగన్ గవర్నర్ ను కలిశారో లేదో సాయంత్రానికి కోడెలపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేయటం గమనార్హం. కోడెలతో పాటు మరో 22 మందిపై 8 సెక్షన్ల క్రింద కేసులు పెట్టారు