నగ్నంగా ఉంటేనే యాక్టింగ్ నేర్పిస్తా … హైదరాబాదులో సూత్రధార్ కామ పాఠాలు…


యాక్టింగ్‌ నేర్పిస్తానని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని.. అందుకు ‘అన్ని విధాలుగా’సిద్ధంగా ఉండాలని ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడో యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకుడు. కవాడిగూడకు చెందిన అచ్నిత్‌ కౌర్‌కు యాక్టింగ్‌ అంటే ఇష్టం. నటనలో శిక్షణ పొందేందుకు హిమాయత్‌నగర్‌లోని ‘సూత్రధార్‌’ఇనిస్టిట్యూట్‌లో కొద్ది రోజుల క్రితం చేరింది. ఆ సంస్థ నిర్వాహకుడు వినయ్‌వర్మ 20 ఏళ్లుగా నటనలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న యువతులను లైన్‌లో నిలబెట్టి అందరూ దుస్తులు విప్పాలని వినయ్‌ ఆదేశించాడు. దీనికి అచ్నిత్‌ కౌర్‌ నిరాకరించింది. దుస్తులు విప్పితేనే యాక్టింగ్‌ నేర్పిస్తానంటూ అతను అసభ్యకరంగా మాట్లాడాడు. ఇలాంటి యాక్టింగ్‌ శిక్షణ తనకు అవసరం లేదంటూ ఆమె ఇనిస్టిట్యూట్‌ నుంచి బయటకు వచ్చి షీ టీమ్‌ను ఆశ్రయించింది.
అన్నింటికీ ఇష్టపడే వస్తున్నారు: వినయ్‌వర్మ
ఈ ఘటనపై నిలదీసేందుకు సదరు ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఛాయదేవి, సెన్సార్‌ బోర్డ్‌ సభ్యురాలు భారతికి వినయ్‌వర్మ షాకిచ్చాడు. ‘గత 20 ఏళ్లుగా ఇనిస్టిట్యూట్‌ని నడుపుతున్నాను. బట్టలిప్పాల్సిందేనని ముందే చెబుతా. అందుకు వారు అంగీకరించే వస్తారు. మీరెందుకు హడావుడి చేస్తున్నారు’అంటూ దబాయించాడు.
మరింత విచారణ చేస్తున్నాం: అబిడ్స్‌ ఏసీపీ బిక్షంరెడ్డి
వినయ్‌వర్మ వ్యవహారశైలిపై లోతుగా విచారణ జరుపుతున్నామని అబిడ్స్‌ ఏసీపీ బిక్షంరెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి ప్రారంభించిన శిక్షణలో ఏడుగురు యువకులు, ఇద్దరు యువతులు చేరినట్లు వివరించారు. 14న వీరందరినీ దుస్తులు విప్పి యాక్టింగ్‌ చేయండనడంతో అచ్నిత్‌ కౌర్‌ వ్యతిరేకించిందన్నారు. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో వినయ్‌వర్మపై సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.

About The Author