కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం…
కాళేశ్వర గంగ ఉప్పొంగింది.
భగీరథ ప్రయత్నంలో మరో జల దృశ్యం సాక్ష్యాత్కారమైంది. పనులు ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయిని అధిగమించింది. అత్యంత కీలకమైన ఆరో ప్యాకేజీ నందిమేడారంలో భారీ మోటార్ వెట్ రన్ విజయవంతమైంది. సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో అధికారులు మొదటి మోటార్ వెట్ రన్ ను నిర్వహించారు. నందిమేడారం సర్జ్ పూల్ నుంచి రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇతర అధికారులు, ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. అటు కాళేశ్వరం వెట్ రన్ విజయవంతం అవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. నందిమేడారం సర్జ్‌పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి.