కూరగాయలు మరియు మిర్చి పంటలో కల్తీ నారు మొక్కల సరఫరా పూర్తిగా అరికట్టే దిశగా
తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు మరియు మిర్చి పంటలో కల్తీ నారు మొక్కల సరఫరా పూర్తిగా అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి మరియు ఉద్యాన ఉత్పత్తుల కమిషనర్ శ్రీ సి. పార్థసారధి IAS మరియు శ్రీ ఎల్. వెంకట్రామ్ రెడ్డి డైరెక్టర్, ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూరగాయ మరియు మిరప మొక్క ఉత్పత్తి మరియు సరఫరా చేస్తున్నటువంటి నర్సరీ యజమానులకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్దీకరణ నిబంధనలు -2017 పై అవగాహన సదస్సు ది.08.05.2019 నాడు ఉద్యాన శిక్షణ సంస్థ నాంపల్లిలో ఏర్పాటు చేయడమైనది.
ఈ సదస్సులో రాష్ట్ర ఉద్యాన డైరెక్టర్ గారు మాట్లాడుతూ నర్సరీలలో మౌలిక సదుపాయాల కల్పన దృడమైన మరియు ఆరోగ్యవంతమైన మొక్కల ఉత్పత్తిలో కీలక పాత్ర వహిస్తుందని తెలియచేస్తు రైతులకు కల్తీ లేనిఆరోగ్యవంతమైన మొక్కల సరఫరా యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. నర్సరీలో రికార్డుల నిర్వహణ తప్పనిసరిగా చేయవలసిందిగా కోరుతూ మొక్కల ఉత్పత్తి మరియు అమ్మకంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడవద్దని తద్వారా విత్తన మరియు నర్సరీ చట్ట నియమనిబంధనలు ప్రకారం శిక్షలకు గురి కావొద్దని హెచ్చరించడం జరిగింది. శ్రీ సి.పార్థసారధి IASవ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి మరియు ఉద్యాన ఉత్పత్తుల కమిషనర్ వారి సందేశంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఈ విత్తన మరియు నర్సరీ చట్టం పై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎటువంటి కల్తీ విత్తన మరియు నారు మొక్కల సరఫరాను జరగకూడదనే దృడ నిశ్చయంతో కఠిన నిబంధనలు మరియు శిక్షలు అమలు చేయవలసినదిగా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని తెలిపినారు. దీనికి కాను రాష్ట్ర స్థాయిలో పోలీస్ మరియు వ్యవసాయ అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పరచి ఎక్కడైతే కల్తీ విత్తనాలు మరియు నారు మొక్కల ఉత్పత్తి మరియు అమ్మకం జరుగుతుందో అక్కడ దాడులు నిర్వహించవలసినదిగా ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. ఈ పంటలను పెంచే రైతులు ముఖ్యంగా సన్న, చిన్న కారు రైతులు అయినందున వారికి ఏకరాకు 80,000 నుండి లక్ష రూపాయలు పంటపండించే ఖర్చు అవుతునందున కల్తీ విత్తన మరియు నారు సరఫరా వల్ల రైతు తీవ్రంగా నష్టపోయి వారి కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉనందువల్ల నర్సరీ యజమానులు నారుమొక్కల పెంపకం మరియు నాణ్యతలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఒక వేళ ఏదైనా అవకతవకలు మరియు పొరపాట్లు కనుక జరిగితే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు చేపడుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ సమావేశంలో నర్సరీలలో రికార్డుల నిర్వహణ, విత్తన చట్టం పై పూర్తిస్థాయి అవగాహన, పి.డి యాక్ట్ నియమ నిబంధనలు, కల్తీ విత్తనాల గుర్తింపు మరియు నర్సరీ యాజమాన్యంలో పాటించవలిసిన నూతన సాంకేతిక విధానాలపై అందరూ నర్సరీ యజమానులకు అవగాహన కల్పించడం కరిగింది. ఈ సమావేశంలో డా.కె.కేశవులు, ఎం.డి. విత్తన దృవీకరణ సంస్థ, శ్రీ శివప్రసాద్, ఉపసంచాలకులు, వ్యవసాయ కమిషనర్ కార్యలయం, శ్రీ విజయ శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్క్టర్, రాచకొండ కమిషనరేట్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది మరియు 125 మంది నర్సరీ యజమానులు పాల్గొనడం జరిగింది.