విశాఖ టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్… కక్ష సాధింపు మొదలైంది అన్న వెలగపూడి…
కోడ్ ఉల్లంఘన, జగన్ని దూషించారు అంటూ అభియోగాలు
వ్యక్తిగత పూచీకత్తుతో స్టేషన్ బెయిల్
కక్ష సాధింపు చర్యలు మొదలు: రామకృష్ణ బాబు
తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబును ఎంవీపీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
గత నెల 23వ తేదీ రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా కోడ్ను ఉల్లంఘించి, బహిరంగ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మా అధినేత జగన్ను దూషించారు, వెలగపూడి… అంటూ వైసీపీ నేత అక్కరమాని విజయనిర్మల మే 25న ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు పై విచారణ జరిపిన ద్వారకా జోన్ ఏసీపీ వైవీ నాయుడు, ఎంవీపీ సీఐ లక్ష్మోజీ, ఐపీసీ 294 (బి), 188 సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 158/19తో కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో నగరంలోని ఎంవీపి స్టేషన్కు వచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేను ఆదేశించారు పోలీసులు… దీంతో వెలగపూడి బుధవారం సాయంత్రం ఎంవీపీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఏసీపీ వైవీ నాయుడు, సీఐ లక్ష్మోజీ ఎదుట హాజరయ్యారు. పోలీసులు అరెస్టు చూపించి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారు అనడానికి, నాపై కేసే ఉదాహరణ. అక్రమ కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు అని పెర్కొన్నారు వెలగపూడి రామకృష్ణ బాబు.