టిటిడి అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు దాదాపు రూ.1100 కోట్ల డిపాజిట్లు…

టిటిడి అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు దాదాపు రూ.1100 కోట్ల డిపాజిట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందిస్తున్నామని, టిటిడి అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు దాదాపు రూ.1100 కోట్ల‌ డిపాజిట్లు అందిన‌ట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం ఉద‌యం ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుపై ఈవో, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతంతో క‌లిసి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు దాదాపు రూ.1100 కోట్ల విరాళాల‌ను భక్తులు అందించారని తెలిపారు. ల‌క్ష‌రూపాల‌యాల‌కు పైగా విరాళాలు అందించిన దాత‌లు 37,169 మంది ఉన్నార‌న్నారు. దాత‌ల‌కు అన్న‌ప్ర‌సాదాల‌పై అవ‌గాహ‌న,  ఒక రోజు అన్న‌ప్ర‌సాద ప‌థ‌కం గురించి తెలియ‌జేయాల‌న్నారు. ఇందులో ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం – రూ.30 లక్షలు,  చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. అదేవిధంగా  ఉదయం అల్పాహారం కోసం – రూ.7 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం – రూ.11.5 లక్షలు, రాత్రి భోజనం కోసం – రూ.11.5 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చ‌న్నారు. అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో చేయ‌వ‌సిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించి, ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తుల‌కు ప్ర‌యోగాత్మ‌కంగా చెక్క స్పూన్లు అందించి, వాటి ఉప‌యోగాన్ని ప‌రిశీలించాల‌న్నారు.

అంత‌కుముందు అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు సేవ‌ల‌ను ఈవో, జెఈవోల‌కు వివ‌రించారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఎఫ్ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, సిఏవో శ్రీ ర‌విప్ర‌సాద్‌, మార్కెటింగ్ అధికారి శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, క్యాట‌రింగ్ అధికారి శ్రీ శాస్త్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
——————————————————————

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

About The Author