ఆ కలెక్టర్ ప్రతి కణంలో మానవత్వమే…
ఇదీ ఓ కలెక్టర్ కథ. తన ఛాంబర్ లోనే కాదు, తనకి సంబంధించిన ఛాంబర్లన్నింటిలో ఏసీలను ఊడదీసి, అనారోగ్యంతో అల్లాడిపోతున్న చిన్నపిల్లల పునరావాస కేంద్రంలో అమర్చారు. మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లా కలెక్టర్ సోమవంశీ గత కొద్ది రోజులుగా తన ఛాంబర్ లో ఫ్యాన్ కిందే విధులు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులకు ఆ రాష్ట్రప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాల్లో చిన్నపిల్లలు వేసవి కాలంలో పడుతున్న ఇబ్బందులు గమనించి వారికి ఏసీలకోసం పర్మిషన్ అడిగితే వేసవికాలం దాటిపోయే అవకాశం ఉంది. అందువల్లే తక్షణం తన కార్యాలయాల్లో వినియోగిస్తున్న ఏసీలన్నిటినీ చిన్నారులుండే ఆరోగ్య కేంద్రాలకు తరలించి 24గంటల్లో అమర్చే ఏర్పాటు చేశారు. ఇది గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిన వ్యవహారమే అయినా కలెక్టర్ ఫ్యాన్ కింద ఎందుకు పనిచేస్తున్నాడని ఆరా తీసిన వారికి విషయం తెలిసిందు. ఉక్కపోత, వేడి చిన్నారుల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తుందని, అందుకే జిల్లా అధికారిగా వాళ్ల సంక్షేమం చూడాల్సిన బాధ్యత తనకు ఉందని తక్షణం రెండో ఆలోచన లేకుండా తన కార్యాలయంలోని ఏసీలు, కూలర్లను అక్కడికి తరలించి వేశానని చెప్పారు. భవిష్యత్ లో చిన్నారులు చికిత్సపొందే వార్డుల్లో ఏసీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పారు.